Saturday, December 21, 2024

మంచి కథలతో మెప్పించే టక్కరి మొసలి

- Advertisement -
- Advertisement -

అందమైన భాషలో, ముచ్చట పడుతూ చదివిస్తూ ఏదో జరుగుతుందని ఊహిస్తుంటే అనుకోని విధంగా ముగింపు ఇచ్చి అవాక్కయ్యేలా చేసేలా రాయడం బాల సాహితీవేత్త కె.వి. లక్ష్మణరావుకే చెల్లింది. ఈ రచయిత కథలన్నీ కూడా అమ్మ భాషలో ఆత్మీయంగా పలకరిస్తుంటాయి. చక్కని ప్రయోజనాన్ని పాఠకులు పొందుతారు. ఈ రచయిత కలం నుంచి కొత్తగా వెలువడిన పుస్తకం టక్కరి మొసలి. ఈ పుస్తకంలోని 17 కథలు దేనికదే గొప్పగా ఉన్నాయి. కొన్ని కథలు సందేశాన్ని ఇవ్వగా , కొన్ని కథలు పాఠాలను నేర్పాయి. మరికొన్ని కథలు గుణపాఠాలను చెప్పాయి.
‘ఒక్కసారి ఆలోచించండి’ కథ మనల్ని అనేక సార్లు ఆలోచించేలా చేస్తుంది. సాధారణంగా ఇళ్లలో తిరిగే ఎలకల్ని బోనులో బంధించి చంపుతుంటారు. ఈ కథలో వినయ్ అలా చేయడం తప్పని చెబుతాడు. సాధారణంగా తప్పు చేసిన వ్యక్తుల్ని పట్టి బంధించి జైలులో పెడతారు కదా. మనుషులకొక న్యాయం, ఎలుకలకు మరొక న్యాయమా? అని ప్రశ్నిస్తాడు. ఎలుకల్ని బంధించిన తర్వాత అడవుల్లో, పొలాల్లో విడిచిపెట్టాలి తప్ప చంపడం నేరం అంటాడు. ఇది నిజమే అనిపిస్తుంది కథ చదివిన వారికి.
‘పసిడి మనసు’ కథలో చింటూ ఆదర్శంగా కనిపిస్తాడు. కరోనా వ్యాధితో బాధపడుతున్న పక్క ఇంటి వారి దరిదాపులకు వెళ్ళొద్దని అమ్మ చెప్పిన మాటలకు ఎంతో బాధపడతాడు. తల్లికి అర్ధమయ్యేలా అమ్మా కరోనా వ్యాధికి దూరంగా ఉండమన్నారు కానీ కరోనా వచ్చిన వారికి కాదు. వారికి దూరంగా ఉంటూనే అవసరమైన సేవలు, సహాయం చేస్తూ త్వరగా కోలుకునేలా చేయాలని చెబుతాడు. నిజంగా ఇది ఒక్క చింటు తల్లికే కాదు. అలా ప్రవర్తించిన మిగతా వాళ్ళకు కూడా వర్తించేలా రాసిన కథ.
‘బురిడీ కొట్టిందిలే బుస్ బుస్ పాము’ కథలో కాకి, చిలుక, పావురం స్నేహితులు. అవి ఆహారం కోసం బయటకు వెళ్లేటప్పుడు చెట్టు కింద పుట్టలో నివసించే పాము వాటి పిల్లలను తినాలని ప్రయత్నిస్తుంది. వాటి పిల్లల్ని రక్షించుకోవడం కోసం కాకి ఆలోచించిన ఉపాయం ప్రకారం చేయడంతో ఆ పిల్లల్ని చంపలేక పోవడమే కాకుండా అక్కడి నుంచి దూరంగా మరో పుట్టలోకి వెళ్లిపోతుంది పాము. కాకి చూపిన తెలివి ఏమిటి? అనేదే కథ చదివి తెలుసుకుంటే నవ్వు వస్తుంది. సమస్య నుండి పారిపోవడం కాకుండా సమస్యను దూరం చేయాలని బోధిస్తుందీ కథ. ‘చిట్టి చీమా నువ్వెక్కడ?’ చాలా మంచి కథ. మంత్రి పదవి కోసం ఆశపడే జంతువులను ఆశ్చర్యపరుస్తూ మృగరాజు ఆడిన నాటకమే ఈ కథ. చీమ ఎక్కడుందో కేవలం కుందేలు మాత్రమే తెలివిగా కనిపెట్టింది. సింహం మంత్రికి యోచనా శక్తి ఉండాలి. నిజానికి, నటనకు మధ్య ఉన్న తేడాను పసిగట్టగలగాలి. అలా చేసినవారు మంత్రి పదవి చేపట్టాలన్న ఉద్దేశంతో నేను ఆడిన ఈ నాటకంలో కుందేలు మాత్రం సఫలీకృతం అయింది అని ప్రకటించి మంత్రిగా నియమిస్తుంది. ఇంతకీ ఆ నాటకం ఏమిటి? మరి కుందేలు ఆ నాటకాన్ని ఎలా కనిపెట్టింది అన్న విషయం కథలో చదివితే బాగుంటుంది.
టక్కరి మొసలి తెలివైన గోపి కథ. మొసలి కన్నీరు కార్చిన ఒక మొసలికి గుణపాఠం చెప్పిన గోపీ సమయస్పూర్తిని తెలుపుతుంది. తాను అపాయం నుండి తప్పించుకోవడమే కాకుండా మొసలికి గుణపాఠం చెప్పిన గోపి పిల్లలకు ఆదర్శంగా నిలుస్తాడు. ఇలాంటి కథలు చదవడం వలన అపాయం నుండి ఉపాయంతో తప్పించుకోవాలని పిల్లలు ఆలోచిస్తారు. మార్పు మంచిదే, గుణమే ప్రధానం మొదలైన కథలు పాఠకుల్ని అలరిస్తాయి. ఆనందింప చేస్తాయి. మిగతా కథలు చదివే పాఠకులు తప్పక ప్రయోజనాన్ని పొందుతారు. పుస్తకానికి వేసిన అందమైన ముఖచిత్రం, లోపలి చిత్రాలు కథలకు తగిన విధంగా అమరాయి. పుస్తకం పేజీలు 44. వెల.60 రూపాయలు. పుస్తకాలు నవ చేతన పబ్లిషింగ్ హౌస్ వారి అన్ని బ్రాంచీలలో దొరుకుతాయి.

నారంశెట్టి ఉమామహేశ్వరరావు
9490799203

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News