మనతెలంగాణ/హైదరాబాద్: ఏక సంఘంగా ఏర్పడిన పదిహేను బిసి కుల సంఘాలకు అనుమతి పత్రాలు అందచేశామని, మిగిలిన బిసి సంఘాలు మార్చి నెలాఖరులోగా ఏక సంఘంగా ఏర్పడి భవన నిర్మాణాలు ప్రారంభించాలని రాష్ట్ర బిసి సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో మేర, మేదర కులాలకు సంబంధించిన ఆత్మగౌరవ భవనాలకు మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. బిసిలు వెనుకబడిన వారు కాదని గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బిసి కులాలు ఆత్మగౌరవంతో తలెత్తుకు బతకాలని నగరంలో వేలాది కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన స్థలాల్ని కేటాయించారని గుర్తుచేశారు. 41 బిసి కులాలకు 83 ఎకరాల భూమి కేటాయించారన్నారు.
అందులో భవనాలు నిర్మించుకోవడానికి ఎకరాకు కోటి రూపాయలు కేటాయించారన్నారు. మేర, మేదర కులస్తుల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో బిసిలకు 16 గురుకులాలు ఉండగా కెసిఆర్ చొరవతో 281 పెంచారని కొనియాడారు. ప్రతి విద్యా సంవత్సరం 1,36,000 మంది బిసి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో విద్యాభ్యాసం పూర్తిచేస్తున్నారని వెల్లడించారు. కల్యాణలక్ష్మిపథకంతో బిసిలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, బిసి కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, జిహెచ్‌ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, బిసి కమిషన్ సభ్యులు కిషోర్‌గౌడ్, ఉపేంద్ర, మేర, మేదర కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Talasani Srinivas laying foundation stone for BC Bhavan in Uppal