Thursday, January 23, 2025

మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం..

- Advertisement -
- Advertisement -

Talasani Srinivas meets MLC Kavitha

మా జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతాం
బిజెపి కార్యకర్తలు భౌతికంగా దాడి చేయటం దారుణం
మా కార్యకర్తలు కూడా దాడులు చేస్తే బిజెపి నాయకులు మిగలరూ ?
ఇలాంటి పరిణామాలు పునరావృత్తమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయి
ఎమ్మెల్సీ కవితకు సంఘీభావం తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
మనతెలంగాణ/ హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడి చేయడాన్ని టిఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్‌లు తీవ్రంగా ఖండించారు. కవిత నివాసానికి వెళ్లి ఆమెకు సంఘీభావం తెలిపారు. బిజెపి కార్యకర్తలు భౌతికంగా దాడి చేయటం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి కెసిఆర్ కుటుంబం, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే బరిగీసి కొట్లాడుతామని వారు హెచ్చరించారు. తమ కార్యకర్తలు కూడా దాడులు చేస్తే బిజెపి నాయకులు మిగులుతారా అని వారు ప్రశ్నించారు.
క్రమశిక్షణ అంటే ఇదేనా: మంత్రి తలసాని
శాంతియుతమైన హైదరాబాద్‌ను నాశనం చేయడానికి బిజెపి పార్టీ కంకణం కట్టుకుందని ఇది దారుణమని పశుసంవర్ధకశాఖ మంత్రి శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. ఇలాంటి పరిణామాలు పునరావృత్తమైతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఎవరి ఇంటిమీదికైనా వెళ్లి దౌర్జన్యం చేస్తే ఊరుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. మేం దాడులు చేస్తే బిజెపి నేతలు మిగులుతారా? క్రమశిక్షణ అంటే ఇదేనా? బిజెపి నేతలు చెప్పాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
ఇప్పటివరకు ఊరుకున్నాం, ఇక ఊరుకునే ప్రసక్తి లేదు: సత్యవతి
నిజంగా తప్పు జరిగిందని తేలితే కేసులు పెట్టాలి కానీ, భౌతికంగా దాడి చేయడం ఏమిటని మంత్రి సత్యవతి రాథోడ్ ప్రశ్నించారు. ప్రజాకోర్టులో దోషులుగా నిలబడే పరిస్థితి వస్తుందని జాగ్రత్త అని ఆమె హెచ్చరించారు. ఇప్పటివరకు ఊరుకున్నాం, ఇక ఊరుకునే ప్రసక్తి లేదని ఆమె హెచ్చరించారు.
కెసిఆర్ కుటుంబంపై ఎలాంటి మచ్చలేదు: మంత్రి ఎర్రబెల్లి
కవితపై బిజెపి నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబంపై ఎలాంటి మచ్చలేదని మంత్రి తెలిపారు. కెసిఆర్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా వదులుకున్నారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ సిఎం పదవీ ఇస్తానంటే వదులుకున్న వ్యక్తి కెసిఆర్ అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఎలాంటి మచ్చలేదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో బిజెపి కావాలనే టిఆర్‌ఎస్ నాయకులను భయభ్రంతులకు గురిచేస్తోందని ఆయన విమర్శించారు. బిజెపి నేతలు వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టాలని చూస్తున్నారని ఎర్రబెల్లి ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదు: మంత్రి గంగుల
ప్రజాస్వామ్యంలో దాడులకు స్థానం లేదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. బిజెపికి మహిళలపై, ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని, సుస్థిర సంక్షేమ పాలన అందిస్తున్న తెలంగాణను చూసి బిజెపి పార్టీ ఓర్వలేకపోతుందన్నారు. బిజెపి దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. మంగళవారం కవిత ఇంటికి వెళ్లిన ఆయన ఆమెను పరామర్శించి, సంఘీభావం తెలియజేశారు. ప్రధాని, బిజెపి వైపల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళా అని కూడా చూడకుండా కక్ష గట్టారని, ప్రణాళికా బద్ధంగా దాడులు చేస్తున్నారన్నారు.
ఇదేనా బిజెపి సంస్కారం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఓ మహిళా నాయకురాలి ఇంటిపై దౌర్జన్యం చేయడం విచారకరమని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. ఇదేనా బిజెపి సంస్కారం అని నిలదీశారు. సమస్యలను లేవదీస్తే గూండాగిరి చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. బిజెపి రౌడీ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఘర్షణ వాతావరణ సృష్టించాలని చూస్తే ఊరుకోమని ఆయన హెచ్చరించారు.
ఆకుపచ్చని తెలంగాణలో బిజెపి అగ్గి రాజేస్తుంది: మంత్రి కొప్పుల ఈశ్వర్
బిజెపి నాయకులు మత సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బిజెపికి చెందిన సంఘ విద్రోహ శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా హోంమంత్రిని కోరుతున్నానన్నారు. ఇక్కడ నెలకొన్న మత సామరస్యాన్ని, ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
బిజెపి నాయకులు కవిత ఇంటిమీదకు రావడం దుర్మార్గం: ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బిజెపి కార్యకర్తలు దాడికి పాల్పడటంపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఖండించారు. ఎమ్మెల్యేలు గోపీనాథ్, ముఠా గోపాల్, దానం నాగేందర్, షకీల్ అహ్మద్, గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, బాల్కసుమన్, జీవన్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులతో పాటు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుళ్ల వెంకటేశ్వరరావులు కవిత ఇంటికి వెళ్లి ఆమె సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరుగుతున్న సమయంలో బిజెపి నాయకులు కవిత ఇంటిపై రావడం దుర్మార్గమని, హేయమైన చర్యని వారు పేర్కొన్నారు. నిన్న కవిత ఇంటి ముట్టడికి కారణం ఏమిటని..? ఆ అంశంపై బిజెపి నాయకులకు అవగాహన ఉందా? అని వారు ప్రశ్నించారు. ఒక ఎంపి మాట్లాడిన మాటలను తప్పుడు ఆరోపణలను పట్టుకొని బాధ్యత గల వ్యక్తి ఇంటికి రావడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. వేలాది సైన్యం తమకు ఉందని, మీ ఇళ్ల మీద దాడులు, పార్టీ ఆఫీసుల మీదకు వస్తే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు. సంఘీభావం చెప్పడానికి వచ్చిన తమ కార్యకర్తలు బిజెపి కార్యాలయం ముట్టడికి వెళతామని అని ఉంటున్నారని, తమకు సంస్కారం ఉందని వారు పేర్కొన్నారు. బిజెపి నాయకులు వ్యవహారించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మా సైన్యం ఎంత ఉందో తెలుసుగా, మేం దాడిచేస్తే మీరు తట్టుకోగలరా? మమ్మల్ని ముట్టుకుంటే మీరు బూడిదైపోతారని వారు బిజెపి నాయకులను హెచ్చరించారు. ఎవరైతే బిజెపి లొంగిపోతారో వాళ్ల కేసులు ముందుకు వెళ్లవన్నారు. సిఎం మాట్లాడకుండా ఉండాలనే కవిత ఇంటిపై దాడి చేశారని వారు ఆరోపించారు.

Talasani Srinivas meets MLC Kavitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News