హైదరాబాద్: గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్ట్ క్రింద చేపట్టిన నగదు బదిలీ పథకంలో లబ్దిదారులకు 15 రోజుల్లోగా గొర్రెలను కొనుగోలు చేసి ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో గొర్రెల పంపిణీ కార్యక్రమంపై మంత్రి సమీక్షించారు. 15 రోజుల్లోగా 100 శాతం గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టు క్రింద ప్రభుత్వం నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో లబ్దిదారులకు ఒక్కొక్కరికి ప్రభుత్వ వాటా ధనం రూ 1.58 లక్షల చొప్పున వారి ఖాతాలకు నగదును బదిలీ చేసిందని వివరించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలో 4,699 మంది లబ్దిదారుల ఖాతాలలో ప్రభుత్వ వాటా ధనం జమచేయడం జరిగిందన్నారు.
ఉప ఎన్నికల కోడ్ అమలులోకి రావడం వల్ల గొర్రెల యునిట్ల పంపిణీలో జాప్యం జరిగిందని మంత్రి వివరించారు. 15 రోజులలోగా వారందరికీ గొర్రెల యూనిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్యాధికారులను మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం పట్ల నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన లబ్దిదారులు మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మునుగోడు నియోజక వర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన అయిలయ్య యాదవ్, సత్తయ్య యాదవ్, పుట్ల నర్సింహా తదితరులు ఉన్నారు.