హైదరాబాద్ అత్యంత నివాసయోగ్యమైన నగరం
ముషీరాబాద్, జయలక్ష్మి టవర్స్ అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి
కేసిఆర్ నాయకత్యంలో నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి
100 ఏళ్ల వరకు తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్ దేశంలోనే అత్యంత నివాస యోగ్యమైన నగరంగా గుర్తింపు పొందిందని, అందుకే హైదరాబాద్‌ను మినీ ఇండియాగా పిలుచుకుంటారని సనత్‌నగర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్ పేట డివిజన్‌లోని ముషీరాబాద్ చౌరస్తా వద్ద గల జయలక్ష్మి టవర్స్ లో వివిధ అపార్ట్మెంట్ వాసులతో ఆదివారం ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. 2014 తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఎంతో అభివృద్ధి చేశారని తెలిపారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నూతనంగా ఫ్లై ఓవర్‌లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రోజు రోజుకు విస్తరిస్తున్న నగర జనాభా ను దృష్టిలో ఉంచుకొని మరో 100 సంవత్సరాల వరకు కూడా నగర ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా కృష్ణా, గోదావరి జలాలను తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం నగరంలో 20 వేల లీటర్ల వరకు ఉచితంగా నీటిని సరఫరా చేస్తుందని, సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నాలాలకు ఎగువ నుండి వరదనీరు వచ్చి పరిసర కాలనీలు, బస్తీలు, రహదారులు ముంపుకు గురయ్యేవని చెప్పారు.
మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రత్యేక చొరవతో ఎస్‌ఎన్‌డిపి కార్యక్రమం క్రింద నాలాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన ఫలితంగా వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. కరోనా సమయంలో కూడా అభివృద్ధి పనులు కొనసాగాయని పేర్కొన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. ఇప్పటి వరకు లక్ష ఇండ్లను నిర్మించగా, 70 వేల ఇండ్లను అర్హులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. 30 వేల ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో కూడా 50 సంవత్సరాలలో జరగని, ఎవరు ఊహించని విధంగా గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశామని వివరించారు. 2014కు ముందు నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీలు సరిగా ఉండేవి కావని, త్రాగునీటి సమస్యను కూడా ప్రజలు ఎదుర్కొన్నారని తెలిపారు. సుమారు 1400 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను చేపట్టి ప్రజల అనేక దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించామని వివరించారు. మెయిన్ రోడ్లతో పాటు కాలనీలు, బస్తీల రోడ్లను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం అనేక ప్రాంతాలలో CC కెమెరాలను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న వారిని ఆదరించాలని కోరారు. మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.