నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు
శుక్రవారం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు
17న పబ్లిక్ గార్డెన్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించనున్న సిఎం
అదే రోజు ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ భవనాలకు ప్రారంభోత్సవం
18న సమరయోధులకు సన్మానాలు
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి అడుగుపెట్టి 75 ఏళ్లు పూర్తి అవుతున్న శుభ సందర్భంగా నేటి నుంచి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం ఎన్‌టిఆర్ స్టేడియంలో 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలులు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ వజ్రోత్సవాలలో భాగంగా 16వ తేదీన 119 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 17వ తేదీ సాయంత్రం ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహించే వజ్రోత్సవ సభకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరవుతురని తెలిపారు. సభకు ముందే మధ్యాహ్నం 1.00 గంటలకు పివిమార్గ్‌లోని పీపుల్స్ ప్లా జా నుంచి సెక్రెటరియేట్ మీదుగా ఎన్‌టిఆర్ స్టేడియం వరకు సాంస్కృతిక దళాలు, ఆట పాటలతో భారీ ర్యా లీని నిర్వహిస్తారన్నారు. ఈ సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి గిరిజన సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. గిరిజన సంప్రదాయాలను తెలియజెప్పే విధంగా కళాకారులచే అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. సుమారు 5వేల మంది కళాకారులు వివిధ వేషధారణలతో కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.అదే విధంగా అన్ని జిల్లా కేంద్రాలలో రాష్ట్రమంత్రులు, ప్రముఖులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల కార్యాలయాలపై జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. హైదరాబాద్‌లో నిర్మించిన కొమురం భీం ఆదివాసీ ఆత్మగౌరవ భవనం, సేవాలాల్ బంజార ఆత్మగౌరవ భవనాలను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. 18వ తేదీన జిల్లా కేంద్రాలలో స్వాతంత్య్ర సమరయోధులకు, కవులు, కళాకారులకు సన్మానాలు, జాతీయ సమైక్యత, సమగ్రతను చాటేలా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించనున్నారు.
Talasani Srinivas Yadav inspects Telangana Integration Day