Tuesday, January 7, 2025

ఇథనాల్ కంపెనీకి మాకు సంబంధం ఉందని నిరూపిస్తే వారికే రాసిస్తా

- Advertisement -
- Advertisement -

ప్రతిపాదిత ఇథనాల్ కంపెనీకి, తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని,- ఆ కంపెనీతో తమకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే వారికే రాసిస్తా -మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. బాధ్యత గల హోదాలలో వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబ సభ్యులపై పిసిసి చీఫ్, మంత్రి సీతక్క, ఎంపి చామల చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. భవిష్యత్‌లో తమపై ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. ప్రభుత్వం రైతుల ఆందోళనను పరిష్కరించే ప్రయత్నం చేయాలి కానీ.. బిఆర్‌ఎస్‌ను, వ్యక్తులను బదనాం చేయాలని ప్రయత్నం తగదని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఎంఎల్‌ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు. ఇథనాల్ కంపెనీకి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుందని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని పేర్కొనడం విడ్డూరం అని పేర్కొన్నారు. ఎపిలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు.. 2016లో రాజమండ్రి ప్రాంతంలో తన కుమారుడు కంపెనీని పెట్టాలనుకున్నారని, అయితే మూడు నెలలకే కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని చెప్పారు.కాంగ్రెస్ నేతలు చెబుతున్న పిఎంకె కంపెనీ నుంచి తన కుమారుడు ఎనిమిదేళ్ల క్రితమే తప్పుకున్నారని అన్నారు. లగచర్లలోనూ ఇదే తరహాలో కెటిఆర్‌పై బురద జల్లే ప్రయత్నం చేశారని.. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఆర్‌సి, ఎస్‌సి ఎస్‌టి కమిషన్ అక్కడ పర్యటించి విచారణ చేస్తుంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు.

తాము రైతులను రెచ్చగొట్టామని అంటున్నారని, తామే కంపెనీ పెట్టించే వాళ్లం అయితే… రైతులను తామెందుకు రెచ్చగొడుతామని ప్రశ్నించారు. తనను, బిఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డడారు. లగచర్ల ఘటన సహా.. ప్రతి అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబాసు పాలయ్యిందని విమర్శించారు. లేనివి ఉన్నట్లు చెప్పటం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనను పరిష్కరించకుండా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. గురుకులాల్లో విద్యార్థుల మరణంపై కోర్టు మెట్టికాయలు వేసిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News