ఇష్టపడి కష్టపడండి…. బంగారు జీవితాన్ని పొందండి
యువతకు ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన
జిఎంఆర్ చిన్మయ విద్యాలయ, జిఎంఆర్ వరలక్ష్మిఫౌండేషన్ సందర్శన
శిక్షణార్థులు, విద్యార్థులతో ముచ్చటించిన ఉప రాష్ట్రపతి
మనతెలంగాణ/హైదరాబాద్: భారతీయ యువతలో సహజంగానే అపారమైన ప్రతిభాపాటవాలున్నాయని నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆ సామర్థ్యాన్ని పదును పెట్టుకుని సద్వినియోగ పరుచుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా తమ బంగారు భవితకు యువత బాటలు వేసుకోవాలని ఆయన దిశానిర్ధేశం చేశారు. ఆదివారం హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలోని జిఎంఆర్- వరలక్ష్మీ ఫౌండేషన్, జిఎంఆర్- చిన్మయ విద్యాలయలను ఉప రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడారు. యువత అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన వారికి సూచించారు. ఇప్పుడు శ్రమించి సొంతకాళ్లపై నిలబడితేనే భవిష్యత్ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. బాగా చదువుకోవాలని, విద్యతోపాటు శారీరక శ్రమను కూడా చిన్నతనం నుంచే అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులతో పేర్కొన్నారు. జిఎంఆర్ సంస్థ చేస్తున్న సామాజిక సేవ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. జీవితంలో ఎంత సంపాదించినప్పటికీ, సంపాదించిన దాన్ని తోటి సమాజంతో పంచుకోవాలనే ఆలోచన చాలా గొప్పదన్నారు. ఉదారవాదంతో సేవాకార్యక్రమాలు, యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న జిఎంఆర్ సంస్థ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావును ఉపరాష్ట్రపతి అభినందించారు.