Wednesday, December 25, 2024

టాలెంట్ మొబిలిటీతోనే మనుగడ

- Advertisement -
- Advertisement -

టాలెంట్ మొబిలిటీ కార్యక్రమం ఉద్యోగులను సంస్థలోని వివిధ స్థానాల మధ్య తరలించడానికి వీలు కల్పించడమే కాకుండా వారి కెరీర్ అభివృద్ధి ఎదుగుదలకు చక్కటి అవకాశం లభిస్తుంది. సంస్థ ప్రో-యాక్టివ్ కావడానికి, ప్రోగ్రెసివ్ కావడానికి టాలెంట్ మొబిలిటీ కార్యక్రమం సుగమనాలను ఏర్పరుస్తుంది. ఉద్యోగులు తమకున్న నైపుణ్యాలను మెరుగుపరచడానికి, కొత్త నైపుణ్యాల సమకూర్పుకు, ఒకే చోట ఒకే పని పని చేసిన దాని వల్ల జనించే విరసం (మొనాటనీ) నశించి, దీర్ఘకాలం వృత్తి కొనసాగింపుకు ఉత్తేజం, ప్రతిభకు గుర్తింపూ లభిస్తాయి. ఏ కారణంగా కొత్త నియమకాలు ఆలస్యమైనా, నియామకాలు జరిపినా కొత్తవాళ్లు దొరకనపుడు సంస్థకు ఏ నష్టమూ రాదు. అంతరాయం లేకుండా నడుస్తుంది. మరో చోటకు వెళ్లాల్సిన ఆగత్యం ఉద్యోగులకుండదు.

‘Talent mobility is not only about retention, culture and improving diversity and inclusion, but also about developing a learning culture in the organisation’ — Ashutosh Garg (CEO & Co-Founder, Eigtfold. AI)

అది కంపెనీ అయినా, కార్యాలయమైనా అక్కడ పని చేసే కార్మికుల్లో, ఉద్యోగుల్లో ప్రతి ఒక్కరికీ ప్రతిభ, నైపుణ్యాలు తప్పనిసరి. ప్రతిభకు ‘టాలెంట్’ అని, నైపుణ్యాలకు ‘స్కిల్స్’ అని ఆంగ్లార్థాలు, మనకు తెలుసు. డిజిటలైజేషన్ యుగం అనుకుంటున్న ప్రస్తుత కాలం పారిశ్రామికీకరణ నాల్గో పార్శ్వం. ఇప్పుడు వ్యక్తిగత ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాలు ఎంత అవసరమో, పని స్థలాల్లో అక్కడ పని చేసే వాళ్లందరి సేవలను వివిధ స్థాయిల్లో, వివిధ స్థానాల్లో వినియోగించుకోవడం సంస్థలకూ రావాలి. దీన్నే ప్రతిభా చైతన్యం అంటారు. ఇంగ్లీషులో టాలెంట్ మొబిలిటీ అంటారు. దురదృష్టమేమంటే ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల, కార్మికుల, అధికారుల స్థానాలను యాజమాన్యం కొంచెం మార్చినా అక్కడ జరిగే ఆ కాస్తా పనులు కుంటుబడే దుస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగుల్లోని ప్రతిభా చైతన్య రాహిత్యం (టాలెంట్ ఇమ్మొబిలిటీ). అంటే ఒకే విభాగం (డిసిప్లిన్)లో పని చేసే ఏ ఇద్దరు ఉద్యోగులకూ ఒకరి పని ఇంకొకరికి రాకపోవటం లేదా వచ్చినా మనస్ఫూర్తిగా పరిపక్వతతో చేయలేకపోవడమన్నమాట. నూటికి ఎనభై మంది కార్మికులు, ఉద్యోగులు వివిధ శాఖల్లో సంస్థల్లో ఇట్లానే ఉన్నారు. అయితే, తమ పనితీరు మెరుగు పడటం ద్వారా లేదా పని చైతన్య నడవడికను అలవర్చుకోవడం ద్వారా సంస్థలు అభివృద్ధి చెందుతాయన్న విషయం తెలిసి కూడా కనీసంగా పరివర్తనకు అంగీకరించరు. ఏ కొన్ని విశిష్ట సంస్థల్లో తప్ప, అన్ని చోట్లా పని చైతన్య రాహిత్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది.

కొంచెం తీవ్రంగా చెప్పాల్సి వస్తే ఒక జాడ్యంగా, ఒక అంటువ్యాధిగా పని చైతన్య రాహిత్యం ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగుల, కార్మికుల కొనసాగింపుపై యాజమాన్యాలు పునరాలోచనలో పడటమే కాదు, తొలగింపు చర్యకూ పూనుకుంటున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల ‘ఉపాధి భద్రత’ అనే అంశాన్ని కాసేపు పక్కనబెడితే, ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు పెంపొందకుండా, ప్రతిభా చైతన్యం నిర్మాణం కాకుండా ఏ సంస్థకూ మనుగడ ఉండదు. మరి, సంస్థలు మూతబడుతున్నప్పుడు చట్టాలను ఆసరా చేసుకొని ఆ తరం వరకు ఆర్థిక లబ్ధినో మరొకటో పొందవచ్చునేమో కానీ, ముందు తరాలకు ఉపాధి అవకాశాలు శాశ్వతంగా తెరపడగలదు. అందుకని ఒక పాలసీగా టాలెంట్ మొబిలిటీ అమలు జరగాల్సిందే. టాలెంట్ మొబిలిటీ పాలసీకి అనుగుణంగా బాధ్యతగా పని సామర్థ్యాలతో సచేతనంగా బంట్రోతు నుండి ఉన్నతాధికారి వరకు ఉద్యోగులంతా విధులు నిర్వహించాల్సిందే. రాదు, లేదు, కూడదు అనకుండా వృత్త్యంతర శిక్షణల్లో ప్రతిభా సామర్థ్యాలను వృద్ధి పరచుకోవాల్సిందే.

ఇప్పుడు ప్రపంచమంతటా పబ్లిక్, ప్రైవేట్ అన్ని సంస్థలు టాలెంట్ మొబిలిటీ మీద దృష్టి కేంద్రీకరించాయి. ‘నైపుణ్యీకరణ (స్కిల్లింగ్), పునః నైపుణ్యీకరణ (రీ స్కిల్లింగ్), నైపుణ్యోన్నతీకరణ ( అప్ స్కిల్లింగ్)’ అనే త్రి విధాత్మక శిక్షణను ఉద్యోగులకు విడతలవారీగా ఇప్పిస్తున్నాయి. ప్రతిభా చైతన్యం ఆవశ్యకతను గురించి న్యూయార్క్ లోని ‘గ్లోట్ -పారిశ్రామిక పని బృందాల మేధోభివృద్ధి సంస్థ’ ప్రతినిధి, టాలెంట్ మొబిలిటీ వ్యూహకర్త, ప్రేరణా వ్యవహర్త నికోల్ ష్రైబర్ ఇట్లా ‘If you’re aiming to boost retention and engagement by putting your people at the helm of their careers, talent mobility needs to become one of your top priorities. Both your people and your business will benefit from a talent mobility strategy that empowers employees to achieve their full potential’ అంటున్నారు.

ఉత్పత్తులకు సంబంధించిన ఒక్క పారిశ్రామిక వ్యాపార రంగంలోనే కాదు, మిగతా సేవారంగంలో కూడా వర్క్ ఫోర్స్ టర్నోవర్ తప్పనిసరైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిభా చైతన్యం, సంబంధిత వ్యూహాలు సంస్థలన్నిటా అవసరం. ఏ సంస్థైనా నూతనత్వంలో ముందుకు వెళ్లాలనుకుంటే, అంతర్గత సంక్షోభాన్ని సరిచేయాలనుకుంటే, మార్కె ట్లో పోటీని తట్టుకొని అధిగమించడానికి అవసరమైన ప్రతిభను కూడగట్టుకోవాలనుకుంటే ఆ సంస్థ తన ప్రాధాన్యతల జాబితాలో టాలెంట్ మొబిలిటీకి ప్రథమస్థానం ఇవ్వాల్సిందే. ఉద్యోగులకు తదుపరి వృత్తిపరమైన దశలను పదోన్నతులను కల్పించడానికి, ఉద్యోగులను క్షేత్రస్థాయిలో సమర్థవంతులుగా మార్చడానికి కెరీర్ చురుకుదనాన్ని (కెరీర్ ఎజిలిటీ) అన్‌లాక్ చేయడమొక్కటే ఆ సంస్థలకున్న ఏకైక మార్గమని మానవ వనరుల (హెచ్‌ఆర్) పండితుల అభిప్రాయం.

జడమనస్తత్వంతో కాకుండా ఎదుగుదల మైండ్ సెట్‌తో ఆలోచన చేస్తే ‘కెరీర్ ఎజిలిటీ అన్‌లాక్’ ఎంత ప్రయోజనదాయకమో ఎవరికైనా బోధపడగలదు. భావనల వ్యాప్తి, పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ, అంతర్వీక్షణం, ఉత్తమ అనుసరణలు ఉద్యోగుల ప్రతిభా చైతన్యంలోకి ప్రవాహ చేరిక (ఇన్ ఫ్లో)గా అబ్బితే, ఇవే తిరిగి ప్రవాహ విడుదల (ఔట్ ఫ్లో) గా వస్తుసేవల రూపేణ సమాజానికి అంది, సంస్థలకు ఆర్థిక పురోవృద్ధిని ప్రసాదిస్తాయంటారు నోబెల్ గ్రహీత పాల్ రోమ్. అవగాహన కోసం స్పష్టత కోసం సింపుల్ గా మాట్లాడుకోవాల్సివస్తే టాలెంట్ మొబిలిటీకి సరైన అర్థం ఏమంటే సరైన నైపుణ్యాలు కలిగిన సరైన వ్యక్తులు సరైన స్థలంలో, సరైన సమయంలో పనిలో ఉండటమే.

కంపెనీలు తమ ఉద్యోగులకు ఆకర్షణీయమైన జీతభత్యాలతోపాటు అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం ద్వారా పునఃనైపుణ్య కార్యక్రమాల్లో నిమగ్నం చేయవచ్చు. నిమగ్నత కనబరచకుండా సంస్థాభివృద్ధికి అవసరమైన భవిష్యత్ అసైన్‌మెంట్ల ఫలితాలను రాబట్టడం ఏ ఉద్యోగికీ వీలుకాదు. టాలెంట్ మొబిలిటీ కంపెనీ అంతర్గతంగా కూడా జరగాల్సిన ఒక ప్రక్రియ కూడా. దీన్నే టాలెంట్ ఇంటర్నల్ మొబిలిటీ అంటారు. ఇందుకో సమర్థ విధానమూ ఉండాలి. ఎందుకంటే ఇదివరకటి కంటే ఇప్పుడు అన్ని వ్యవస్థలకూ పారదర్శకమైన సమర్థవంతమైన సిబ్బంది ఆవశ్యకత తప్పనిసరైంది. అప్పుడు మాత్రమే సంస్థలు నిరంతరాభివృద్ధిని సాధిస్తూ తత్సంబంధ సూచీల్లో గుణాత్మకతను నిలబెట్టుకోగలుగుతాయి. ఉద్యోగులకు ఏ పని ఎక్కడ, ఎప్పుడు కేటాయించబడ్డా ఎవళ్లకు వాళ్లు విజయవంతంగా తమ పాత్రలను పోషించడానికి అవసరమైన ప్రమాణబద్ధమైన ఉన్మిఖీకరణ జరిగితేనే టాలెంట్ మొబిలిటీ ఒక కార్యక్రమంగా వర్థిల్లితీరగలదు.

టాలెంట్ మొబిలిటీ కార్యక్రమం ఉద్యోగులను సంస్థలోని వివిధ స్థానాల మధ్య తరలించడానికి వీలు కల్పించడమే కాకుండా వారి కెరీర్ అభివృద్ధి ఎదుగుదలకు చక్కటి అవకాశం లభిస్తుంది. సంస్థ ప్రో-యాక్టివ్ కావడానికి, ప్రోగ్రెసివ్ కావడానికి టాలెంట్ మొబిలిటీ కార్యక్రమం సుగమనాలను ఏర్పరుస్తుంది. ఉద్యోగులు తమకున్న నైపుణ్యాలను మెరుగుపరచడానికి, కొత్త నైపుణ్యాల సమకూర్పుకు, ఒకే చోట ఒకే పని పని చేసిన దాని వల్ల జనించే విరసం (మొనాటనీ) నశించి, దీర్ఘకాలం వృత్తి కొనసాగింపుకు ఉత్తేజం, ప్రతిభకు గుర్తింపూ లభిస్తాయి. ఏ కారణంగా కొత్త నియమకాలు ఆలస్యమైనా, నియామకాలు జరిపినా కొత్తవాళ్లు దొరకనపుడు సంస్థకు ఏ నష్టమూ రాదు.

అంతరాయం లేకుండా నడుస్తుంది. మరో చోటకు వెళ్లాల్సిన ఆగత్యం ఉద్యోగులకుండదు. ఉన్నవాళ్లను తొలగించి మరొకర్ని తీసుకునే అవసరం యాజమాన్యాలకూ ఉండదు. ఇక్కడ మారుతున్న పరిస్థితులకూ, మార్కెట్ డిమాండ్ కూ అనుగుణంగా టాలెంట్ మొబిలిటీ కార్యక్రమాన్ని సంస్థలు చేపట్టకపోయినా, టాలెంట్ మొబిలిటీ కార్యక్రమంలో సిబ్బంది ఒదగక పోయినా అది కాంపౌండ్ ఎఫెక్ట్‌గా మారి సంస్థ దివాళాకు, ఉద్యోగుల టర్మినేషన్ వరకు పరిస్థితులు విషమిస్తాయి. టాలెంట్ మొబిలిటీకి సంబంధించి సంస్థకు, ఉద్యోగులకు మధ్యగల ఉభయ ప్రమేయాన్ని వ్యాఖ్యానిస్తూ ప్రముఖ మేనేజ్‌మెంట్ నిపుణురాలు ‘అన్నే గ్రాహం’, ‘ఉత్పత్తులు సేవల్లో నాణ్యతా ప్రమాణాలను అందించే సృజనాత్మకత ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మికులల్లో పని సమూహాల్లో కొరవడితే, టాలెంట్ మొబిలిటీ ప్రోగ్రాముల అనుసంధానంతో లెర్నింగ్ కల్చర్ అలవరచడంలో సంస్థలు వెనకబడితే జనాలు వాళ్లదారి వాళ్లు చూసుకుంటారు’ అని హెచ్చరిస్తారు. నిజమే కదా! మరి, సంస్థే పోయినప్పుడు ఉద్యోగమూ ఉండదు. ప్రోత్సాహం, అభివృద్ధి కరువైనప్పుడు ఉద్యోగులూ ఉండరు. ప్రపంచీకరణ తెరచిన ద్వారంలో ప్రజలకు ప్రత్యామ్నాయాలుంటాయి. మార్పుతో మమేకంతో కాకుంటే సంస్థా ఉద్యోగులే నష్టపోతారు.

డా. బెల్లి యాదయ్య
9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News