మహిళలను చేర్చలేదు
న్యూఢిల్లీ: తాలిబన్లు మంగళవారం ఉప మంత్రుల జాబితాను ప్రకటించారు. అయితే ఆ జాబితాలో ఏ మహిళా పేరును పేర్కొనలేదు. తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ కొత్త వారి పేర్ల జాబితాను కాబుల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో విడుదలచేశారు. క్యాబినెట్ విస్తరణను ముజాహిద్ సమర్థించారు. అందులో హజారస్ వంటి మైనారిటీ తెగ సభ్యులను కూడా చోటుకల్పించామన్నారు. అయితే ఆయన మహిళలను క్యాబినెట్‌లో తర్వాత చేరుస్తామని పేర్కొన్నారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో సెప్టెంబర్ 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ప్రకటించారు. రెండు దశాబ్దాల తర్వాత అధికారంలోకి వచ్చిన ఈ తాత్కాలిక ప్రభుత్వానికి వ్యవస్థాపక సభ్యుడు మొహమ్మద్ హసన్ అఖుండ్ సారథ్యం వహిస్తారని కూడా ప్రకటించారు. హఖ్ఖాని నెట్‌వర్క్‌లో కీలక స్థానాల్లో ఉన్న అనేకమంది నాయకుల పేర్లను కూడా తాలిబన్లు చేర్చారు. హఖ్ఖాని నెట్‌వర్క్ వ్యవస్థాపకుడి కుమారుడు సిరాజుద్దీన్ హఖ్ఖాని పేరును కూడా కొత్త ఆఫ్ఘన్ తాత్కాలిక మంత్రిగా ప్రకటించారు. కాగా అతడు ఆత్మాహుతి దాడులు, అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉన్నందున ఎఫ్‌బిఐ వెతుకుతున్న వారిలో ఒక్కడిగా ఉన్నాడు.
ఇదిలా ఉండగా ఏకాంతవాసంలో ఉన్న తాలిబన్ చీఫ్ హైబతుల్లాహ్ అఖుండ్ జాదాను మతం, రాజకీయం, రక్షణ వ్యవహారాలలో చివరి నిర్ణయం ప్రకటించే సుప్రీం నాయకుడిగా కూడా తాలిబాన్ ప్రకటించింది.