నిలువెల్ల బురఖాకు తాలిబన్ల ఫర్మానా
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ పాలకులు శనివారం దేశంలో మహిళల వస్త్రధారణపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు వెలువరించారు. అఫ్ఘన్ మహిళ ఖచ్చితంగా తల నుంచి పాదాల వరకూ కప్పుతూ ఉండేలా దుస్తులు ధరించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. బయటకు వచ్చినప్పుడు శరీరం కన్పించకుండా పూర్తిస్థాయిలో బురఖాలతోనే రావాల్సి ఉంటుందని అత్యంత పదునైన రీతిలో కీలక ఆజ్ఞలు ఫర్మానాలుగా జారీ కావడంతో దేశంలోని హక్కుల ఉద్యమకర్తలు ఇప్పటివవరకూ వ్యక్తం చేస్తూ వచ్చిన భయాలు నిర్థారణ అయ్యాయి. బయటకు వచ్చినప్పుడు మహిళల కండ్లు కన్పించాలి. ఈ క్రమంలో వారు పై నుంచి నేల వరకూ తాకేలా ఉండే బురఖా వేసుకుని తీరాలి.
1996 , 2001లలో అప్పటి తాలిబన్ల హయాంలలో కూడా ఇటువంటి కటుతర నిబంధనలే అమలులోకి వచ్చాయి. తాము ఇప్పుడు వెలువరించిన బురఖా ఆదేశాలను దేశంలో విలువలు సాంప్రదాయాల మంత్రి ఖాలీద్ హనాఫీ సమర్థించారు. తమ అక్కాచెల్లెళ్లు సమాజంలో గౌరవ మర్యాదాలతో నిలవాలని, వారు హుందాగా కన్పించాలని తాము తాపత్రయపడుతున్నామని ఈ క్రమంలోనే ఈ వస్త్రధారణ నిబంధన విధించినట్లు తెలిపారు. మహిళలంతా హిజాబ్‌లకు దిగాల్సిందే, ఈ క్రమంలో అత్యుత్తమమైన హిజాబ్ చడోరి అంటే నిలువెత్తు బురఖా అని , వీటిని ధరించే అఫ్ఘన్ మహిళ తమ హుందాను గౌరవాన్ని చాటుకోవాలని మంత్రి స్పష్టం చేశారు.