కాబూల్: అమెరికా బలగాలు వైదొగిన తర్వాత అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్న తాలబన్లు మహిళల హక్కులను ఒకటొకటిగా హరిస్తున్నారు. మహిళలు కార్యాలయాల్లో పని చేయడం, ఉన్నత చదువులు చదవడంపై ఆంక్షలు పెట్టిన తాలిబన్లు ఇప్పుడు వాళ్ల శరీరాలపైన కూడా పెత్తనం సాగించడానికి ప్రయత్నిస్తున్నారు. అఫ్గాన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో గర్భ నిరోధక మాత్రలు, సాధనాల విక్రయాలను ఆసేసినట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘గార్డియన్’ తెలిపింది.
మహిళలు గర్భనిరోధక మాత్రలను వాడడం ముస్లిం జనాభాను కంట్రోల్ చేయడానికి పాశ్చాత్య దేశాలు పన్నిన కుట్రగా తాలిబన్లు ఆరోపిస్తున్నారు. తాలిబన్లు ఇంటింటికీ వెళ్లి గర్భ నిరోధక మాత్రలు వాడవద్దని మహిళలను బెదిరించడమే కాకుండా గర్భనిరోధక మాత్రలు, సాధనాలను విక్రయించవద్దని మంత్రసానులు, మందుల దుకాణాల వారిని హెచ్చరిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. ఒక వేళ ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే వారిని అదుపులోకి తీసుకొంటున్నట్లు తెలుస్తోంది.
‘వాళ్లు నా దుకాణానికి తుపాకులతో రెండుసార్లు వచ్చి, గర్భ నిరోధక మాత్రలు దుకాణంలో అమ్మకానికి ఉంచవద్దని బెదిరించారు. వాళ్లు కాబూల్‌లోని ప్రతి మందుల షాపును రెగ్యులర్‌గా చెక్ చేస్తున్నారు. దీంతో మేము వాటిని అమ్మడం ఆపేశాం’ అని నగరంలోని ఓ మందుల దుకాణం యజమాని గార్డియన్‌తో అన్నాడు. మీరు బయటికి వెళ్లి పాశ్యాత్య పద్ధతి అయిన జనాభా నియంత్రణ గురించి ప్రచారం చేయవద్దని, ఇది అనవసరమైన పనని తాలిబన్లు తనను హెచ్చరించినట్లు ఓ మిడ్‌వైఫ్ పత్రికతో చెప్పింది.
ఈ నెల ప్రారంభంనుంచి మందుల దుకాణాల్లో గర్భనిరోధక మాత్రలు స్టాక్ పెట్టడానికి అనుమతించడం లేదని, ఉన్న స్టాక్ అమ్మడానికి కూడా తాము భయపడుతున్నామని కాబూల్‌లోని మరో మందుల దుకాణం యజమాని ‘గార్డియన్’ పత్రికతో అన్నాడు. కాగా ‘తాలిబన్ల పెత్తనం మహిళల చదువులు, ఉద్యోగాలపైనే కాకుండా ఇప్పుడు వాళ్ల శరీరాలకు కూడా పాకింది. ఇది దారుణం’అని తాలిబన్‌లో పుట్టి బ్రిటన్‌లో సామాజిక ఉద్యమ కార్యకర్తగా ఉన్న షబ్నమ్ నసిమి గార్డియన్‌తో అన్నారు. కుటుంబ నియంత్ర; గర్భ నిరోధక సేవల గురించి తెలుసుకోవడం మహిళల ప్రాథమిక హక్కులో భాగమని ఆమె అన్నారు.