రాజకీయ, వాణిజ్య బంధం చాలా ముఖ్యం
తాలిబన్ అగ్రనేత షేర్ మహ్మద్ ప్రకటన
కాబూల్ : భారత దేశంతో సత్సంబంధాలను కొనసాగిస్తామని తాలిబన్ అగ్ర నేత షేర్ మహమ్మద్ అబ్బాస్ స్టనెక్‌జాయ్ ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్‌ను వశం చేసుకున్న తర్వాత తాలిబన్ అగ్ర నేత ఒకరు భారత్ గురించి మాట్లాడటం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన ఓ వీడియోను తాలిబన్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. 46 నిమిషాల నిడివిగల ఈ వీడియోలో స్టనెక్‌జాయ్ మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధం ముగిసిందని చెప్పారు. షరియా ఆధారంగా ఇస్లామిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా సహా వివిధ దేశాలతో సంబంధాలపై తాలిబన్ల అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌తో రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను కొనసాగిస్తామన్నారు. ఈ ఉప ఖండంలో భారత దేశం చాలా ముఖ్యమైన దేశమని చెప్పారు. గతంలో మాదిరిగానే అన్ని రకాల సంబంధాలను కొనసాగిస్తామన్నారు. పాకిస్థాన్ గుండా భారత దేశం నుంచి వాణిజ్యం జరగడం తమకు చాలా ముఖ్యమని చెప్పారు. గగనతలం గుండా వాణిజ్యానికి కూడా అవకాశాలు ఉన్నాయన్నారు. తాలిబన్ అధికార ప్రతినిధులు సుహెయిల్ షహీన్, జబీహుల్లా ముజాహిద్ ఇటీవల పాకిస్థాన్ మీడియాతో మాట్లాడుతూ, భారత దేశంతో సంబంధాల గురించి అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఇతర దేశాలతో సంబంధాల గురించి స్టనెక్‌జాయ్ వంటి తాలిబన్ అగ్ర నేత ఒకరు మాట్లాడటం ఇదే తొలిసారి.