అడ్డుకున్న తాలిబన్లు
ఎయిర్‌పోర్టుకు చేరని 140 మంది
34 మందితోనే కదిలిన వాయుదళ విమానం
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో ప్రజలు దేశం వీడివెళ్లకుండా తాలిబన్లు అడ్డుకుంటున్నారు. 140 మంది హిందువులు, సిక్కు అఫ్ఘన్లు కాబూల్ వీడి వెళ్లకుండా తాలిబన్లు మార్గమధ్యంలోనే నిలిపివేశారు. ఈ బృందం కాబూల్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సిద్ధం అయింది. స్థానిక కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని భారత వైమానిక దళ (ఐఎఎఫ్)కు చెందిన ప్రత్యేక విమానం వీరిని తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్న దశలో వీరు ఎయిర్‌పోర్టుకు చేరకుండా తాలిబన్లు అటకాయించారని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షులు పునీత్ సింగ్ తెలిపారు. ఐఎఎఫ్, భారత విదేశాంగ మంత్రిత్వశాఖతో సమన్వయం వహిస్తూ సింగ్ భారతీయుల తరలింపును పర్యవేక్షిస్తున్నారు. ఈ భారతీయ బృందం విమానాశ్రయానికి సకాలంలో చేరుకోలేకపోవడంతో బుధవారం నుంచి విమానాశ్రయంలోనే ప్రత్యేక విమానం ఉంటూ వస్తోంది. తరలింపు ప్రక్రియ వాయిదా పడిందని పునీత్ సింగ్ గురువారం తెలిపారు.
భారతీయులు , అఫ్ఘన్‌లోని సిక్కులు, అక్కడి హిందువులను యుద్ధ ప్రాతిపదికన భారత్‌కు చేర్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ దేవీశక్తి’ పేరిట తరలింపు ప్రక్రియ తలపెట్టింది. ముందుగా ఎటువంటి చిక్కులు లేకుండానే భారతీయుల తరలింపు సాగుతూ వచ్చింది. అయితే ఎయిర్‌పోర్టు వెలుపలనే ఇప్పుడు భారతీయుల బృందాన్ని బుధవారం రాత్రి తాలిబన్లు నిలిపివేయడం కీలక అంశంగా మారింది. వాయుదళ విమానంలో దాదాపు 200 మంది హిందువులు, సిక్కులు ఇతరులు గురువారం ఉదయం హిండాన్ ఎయిర్‌బేస్‌కు చేరాల్సి ఉంది. అయితే ప్రజలు దేశం వీడి వెళ్లకుండా తాలిబన్లు కాబూల్‌లో అన్ని మార్గాలను కట్టడి చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారులను తమ అధీనంలోకి తెచ్చుకుని పహారా కాస్తున్నారు. ఇప్పటికీ భారత ప్రభుత్వపు తరలింపు కార్యక్రమంతో మొత్తం 565 మంది దిగ్బంధ వ్యక్తులను ఇండియాకు తీసుకువచ్చారు. ఇతర పౌరులను కలిపి చూస్తే ఆపరేషన్ దేవీ శక్తి పరిధిలో ఇప్పటివరకూ ఇండియా తీసుకువచ్చిన వారి సంఖ్య 800కు పైగా ఉందని నిర్థారణ అయింది. తరలించిన వారిలో భారత రాయబార కార్యాలయ సిబ్బంది , 263 మంది భారతీయులు, 112 మంది అఫ్ఘన్ జాతీయులు, అక్కడి సిక్కులు ఉన్నారు. తరలివచ్చిన వారిలో ఇద్దరు అఫ్ఘన్ ప్రజా ప్రతినిధులు కూడా ఉన్నారు.
దేశం వీడి వెళ్లొద్దు ..ఇ. ఏతో నడవండి: తాలిబన్ల తాజా పిలుపు
అఫ్ఘనిస్థాన్ నుంచి ప్రజలు తరలివెళ్లకుండా తాలిబన్లు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకించి అఫ్ఘన్ జాతీయులు దేశం వీడి వెళ్లరాదని, వచ్చే కొద్ది వారాలలో ఏర్పాటు అయ్యే తమ ఇస్లామిక్ ఏమిరేట్ దేశ పౌరులుగా కలిసి పనిచేయాలని తాలిబన్లు పిలుపునిస్తున్నారు. కాబూల్ ఇతర చోట్ల ప్రధాన కూడళ్లలో మైక్‌లలో తాలిబన్లు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారు. మరో వైపు బహుళ స్థాయిలో చెక్‌పాయింట్లు, మళ్లకంచెలు ఏర్పాటు చేయడం, అత్యధిక సంఖ్యలో వివిధ సాయుధ బలగాలు రోడ్లపై ఉండటం, ఇతర దేశాల నుంచి వచ్చే విమానాలకు ల్యాండింగ్ అనుమతి జాప్యం, పలు దేశాలు అఫ్ఘన్ నుంచి వచ్చే విమానాలకు ఇతర దేశాలు సరిగ్గా అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు తాలిబన్లు ప్రజలను మార్గమధ్యంలో నిలిపివేయడం వంటి పలు కారణాలతో భారతదేశం, ఇతర దేశాల తరలింపు ప్రక్రియలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి.