ఘజ్నీ (అఫ్ఘనిస్థాన్) : తాలిబన్ల దేశంలో ఇద్దరు దోషులకు బహిరంగ మరణశిక్షను అమలుపర్చారు. ఓ హత్య కేసులో దోషులుగా ఖరారయిన ఇద్దరిని తూర్పు అఫ్ఘనిస్థాన్‌లోని ఘజ్నీ సిటీలో ఫుట్‌బాల్ స్టేడియంలో గురువారం అసంఖ్యాక జనం చూస్తూ ఉండగా తుపాకితో పలుమార్లు కాల్చిచంపారు. ఈ శిక్ష అమలుకు ముందు శిక్ష అమలుకు సంబంధించి తాలిబన్ల అత్యున్నత స్థాయి అధినేత హిబతుల్లా అఖుంద్‌జదా సంతకం చేసిన మరణశిక్ష వారంటును స్టేడియంలోనే సుప్రీంకోర్టు అధికారి అతిఖుల్లా డార్విష్ బిగ్గరగా చదివి విన్పించారు. వెంటనే దోషులపై తూటాల వర్షం కురిసింది. వీరి ఆర్తనాదాలు, జనం కేకల నడుమ మరణదండన అమలు అయింది.
దీనిని తిలకించేందుకు స్టేడియానికి భారీ సంఖ్యలో ప్రజలను తరలించారు. దోషుల కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి తరలివచ్చిన వారిలో ఉన్నారు. కంటికికన్ను పన్నుకు పన్ను అనే ఇస్లామిక్ చట్టం ఖిసాస్‌కు అనుగుణంగా ఈ శిక్ష అమలు జరిగింది. మరణశిక్షలపై క్షమాబిక్షలు తమ సంప్రదాయంలో లేవని తాలిబన్ల పాలకులు స్పష్టం చేశారు. స్థానిక ఆచార వ్యవహారాలు , సంస్కృతి, మతపరమైన ఆలోచనలు కీలకమని ,ద దీనిని ఎవరూ జవదాటరాదని ఈ క్రమంలోనే దోషులకు మరణశిక్షలను బహిరంగంగా అమలు చేయడం జరిగిందని తాలిబన్ల అధికార ప్రతినిధి తెలిపారు.