క్షురకులకు తాలిబన్ ప్రభుత్వ ఆదేశం
కాబుల్: పురుషులకు గడ్డం గీయడాన్ని లేదా ట్రిమ్మింగ్ చేయడాన్ని నిషేధిస్తూ హెల్మండ్ ప్రావిన్సులోని అన్ని క్షవరశాలలకు తాలిబన్ ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీచేసింది. ఇస్లామిక్ చట్టం(షరియా) ప్రకారమే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తాలిబన్ ప్రకటించింది. అఫ్ఘాన్‌లోని హెల్మండ్ ప్రావిన్సు రాజధాని లష్కర్ గహ్‌లోని క్షురకులందరికీ ఈ మేరకు ఆదేశాలను ప్రావిన్సు ప్రభుత్వం జారీచేసింది. ఈ వార్తను విని తన గుండె ముక్కలైందంటూ లష్కర్ గహ్ నివాసి బిలాల్ అహ్మద్ వాపోయాడు. ఇది నగరమని, ఇక్కడి ప్రజలు తమ జీవన విధానానికి తగ్గట్టు నడుచుకుంటారని, ఇక్కడి ప్రజలను వారి మానాన వారిని వదిలివేస్తే మంచిదంటూ అతను అభిప్రాయపడ్డాడు.
1990 దశకంలో ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న కాలంలో కూడా తాలిబన్లు ఇస్లామ్‌కు తమ సొంత భాష్యాన్ని చెప్పుకుంటూ అత్యంత క్రూరంగా పాలన సాగించారు. ఈ ఏడాది ఆగస్టు 15న తిరిగి అఫ్ఘాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు మళ్లీ తమదైన శైలిలో పాలన కొనసాగిస్తున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. హెరాత్ నగరంలో గత శనివారం నలుగురు కిడ్నాపర్లను హతమార్చిన తాలిబన్ సైనికులు వారి శవాలను బహిరంగ ప్రదేశంలో వేలాడదీయడం ఇందుకు తాజా ఉదాహరణ. తాజాగా&తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే శిక్షకు గురికాకతప్పదంటూ క్షురకులకు తాలిబన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీచేయడం గమనార్హం. అయితే ఎటువంటి శిక్షలు ఉంటాయో మాత్రం వెల్లడించలేదు.