అఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్లు ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వం కరడుగట్టిన ఉగ్రవాదులతో నిండి ఉండడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. గత వారమే జరిగి ఉండవలసిన ప్రభుత్వ కూర్పు వాయిదా పడి మంగళవారం నాటికి ఒక కొలిక్కి వచ్చింది. అయినప్పటికీ ఇది తాత్కాలిక ప్రభుత్వమేనని తాలిబన్లు ప్రకటించడం విశేషం. అంటే పదవుల పంపకంలో వారిలో వారికి తలెత్తిన విభేదాలు పూర్తిగా పరిష్కారం కాలేదని బోధపడుతున్నది. ప్రతిఘటన దళాలతో తీవ్ర పోరాటం తర్వాత పంజ్‌షిర్ తమ ఆధీనంలోకి వచ్చిందని తాలిబన్లు ప్రకటించుకున్నప్పటికీ అక్కడి పరిస్థితి వారికి అంతగా అనుకూలంగా లేదని బోధపడుతున్నది. పంజ్‌షిర్‌లో పాకిస్తాన్ నుంచి సైనిక సహాయం అంది ఉండకపోతే తాలిబన్లు దానిని వశపరుచుకోడం సాధ్యమయ్యేది కాదు. అందుకే తమ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం అంతం కావాలంటూ కాబూల్‌లో మహిళా ప్రదర్శకులు నినదించారు. పాకిస్తాన్ మద్దతు వల్లనే తాలిబన్లు తిరిగి అఫ్ఘాన్‌లో అడుగు పెట్టగలిగారని వారు భావిస్తున్నారు. ఆ నేపథ్యం మంగళవారం నాడు కాబూల్‌లో ‘పాకిస్తాన్ నశించాలి’, స్వేచ్ఛ ‘వర్ధిల్లాలి’, ‘పాకిస్తాన్ చేతిలో కీలుబొమ్మలు తాలిబన్లు’ అనే నినాదాలు మిన్నుముట్టాయి.
అందుచేత మంగళవారం నాటి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుతో అఫ్ఘాన్‌లో తాలిబన్ల నేతృత్వంలో సుస్థిర పాలన నెలకొన్నదని అనుకోలేము. తాత్కాలిక ప్రధానిగా నియమితుడైన ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ పైన ఐక్యరాజ్య సమితి ఆంక్షలున్నాయి. ఉప ప్రధానిగా నియమితుడైన అబ్దుల్ ఘనీ బరాదర్ ఇటీవల అమెరికా సేనల ఉపసంహరణ ఒప్పందంపై సంతకాల ఘట్టాన్ని పర్యవేక్షించాడు. 2018లో పాక్ జైలు నుంచి విడుదలైన తర్వాత నుంచి తాలిబన్ల రాజకీయ వ్యవహారాల సారథిగా పని చేశాడు. మరణించిన తాలిబన్ల సుప్రీంనేత, ఆ సంస్థ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ కుమారుడు ముల్లా యాకూబ్ రక్షణ మంత్రిగా నియమితుడయ్యాడు. అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన ఉగ్రమూక హక్కానీ నెట్‌వర్క్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీకి ఆంతరంగిక భద్రత శాఖను అప్పగించారు. అఫ్ఘాన్ గత ప్రభుత్వ ఉన్నతాధికారులను హతమార్చిన దారుణమైన చరిత్ర ఈ నెట్‌వర్క్‌కు ఉంది. ఇతడిపై అమెరికా 5 మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. ఈ విధంగా నిత్యం రక్తపాత సృష్టికి అలవాటుపడిపోయిన 33 మందితో తాలిబన్ల తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయింది.
వీరంతా అక్కడి జనాభాలో 40 శాతంగా ఉండే పష్తూన్ తెగవారేనని వార్తలు చెబుతున్నాయి. ఇంతటి మంత్రి వర్గంలో ఒక్క మహిళగాని, తాలిబనేతరులు ఒక్కరైనా గాని లేకపోడం గమనించవలసిన విషయం. అందుకే మంగళవారం నాడు భారీ ప్రదర్శన జరిపిన మహిళలు పరిపాలనలో భాగస్వామ్యాన్ని కూడా కోరుతూ నినాదాలిచ్చారు. పాలన అన్ని స్థాయిల్లోనూ తమకు ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేశారు. విచిత్రమేమిటంటే నిన్నటి వరకు ప్రాణాలు తీయడానికి అలవాటుపడి, వేలు తుపాకీ మీట మీద ఉంచుకొని గడిపిన వారు ఇప్పుడు దాదాపు 4 కోట్ల జనాభా కలిగిన అఫ్ఘానిస్తాన్‌కు శాంతియుత, సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించే బాధ్యతను స్వీకరించారు. కనీస మానవ హక్కులను కూడా అనుమతించని కరకు మత చట్టం ప్రకారం ప్రజల జీవితాలను శాసించే పనిని చేపట్టారు. 19962001 మధ్య సాగిన తాలిబన్ల తొలి పాలనలో మహిళలు, బాలలు చెప్పనలవికాని కష్టాలెదుర్కొన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు 20 ఏళ్ల పాటు మహిళలు సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించారు.
బయటికి వచ్చి చదువుకోడం, ఉన్నత విద్య, ఉద్యోగాలు చవిచూడడం అలవాటైంది. వారిప్పుడు మళ్లీ బురఖాలు ధరించి విద్యా సంస్థలకు హాజరయ్యే పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. మెజారిటీ స్త్రీలు ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి మళ్లీ తలెత్తింది. ఈసారి మహిళల పట్ల ఉదారంగా వ్యవహరిస్తామని మొదట్లో బుజ్జగింపు ప్రకటన చేసిన తాలిబన్లు ఆ మాట నిలబెట్టుకోడం లేదని రుజువవుతున్నది. ఇంకొక వైపు తాలిబన్లకు స్థానిక ఐసిస్ నుంచి, ఇతర ఉగ్ర ముఠాల నుంచి పోటీ తప్పని సరి అయ్యే పరిస్థతి కనిపిస్తోంది. తాలిబన్ల ఆధీనంలోని అఫ్ఘానిస్తాన్ ఇరుగుపొరుగు దేశాల భద్రతకు కూడా ముప్పేనని భావించవలసి ఉంది. ఇతర దేశాల్లో టెర్రరిజాన్ని పెంచే శక్తులకు అఫ్ఘానిస్తాన్ ఆశ్రయమివ్వరాదని భారత, రష్యాలు ఇటీవల సంయుక్త ప్రకటన చేశాయి.
అఫ్ఘాన్ పరిణామాలు అటు రష్యాలోనూ ఇటు కశ్మీర్‌లోనూ ఉగ్రవాద శక్తులు బలపడడానికి తోడ్పడే అవకాశమున్నదని భారత దేశంలోని రష్యా రాయబారి నికొలోయ్ కుదాషెవ్ పేర్కొన్నారు. భారత దేశంతో కలిసి ఈ ముప్పును ఎదుర్కొంటామని ప్రకటించారు. చైనా, రష్యా, పాక్‌లు కలిసి తాలిబన్లతో సంబంధాలు పెట్టుకొంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అంటున్నారు. అయితే తాలిబన్లు ఏమేరకు అక్కడ స్థిరపడతారు, ప్రగతి శీల జీవన శైలిని, సామాజిక రీతులను అలవర్చుకున్న అక్కడి ప్రజలు వారిని దారిలోకి తేవడంలో ఎంత వరకు విజయవంతమవుతారు అనే దానిని బట్టి భవిష్యత్తు పరిణామాలుండవచ్చు.