న్యూఢిల్లీ: విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని భారత్‌కు చెందిన డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజిసిఎ)కు సెప్టెంబర్ 7న తాలిబన్ ప్రభుత్వం లేఖ రాసింది. ఆ లేఖను ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక పౌర విమానయాన, రవాణా మంత్రి అల్‌హజ్ హమీదుల్లాహ్ అఖుంద్జాదా రాశారు. లేఖ అందిన విషయాన్ని డిజిసిఎ చీఫ్ అరుణ్ కుమార్ ధృవీకరించారు. అయితే ఇది పాలసీకి సంబంధించిన విషయం కనుక దీనిపై పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌ను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆగస్టు 16 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే తాలిబన్ ప్రభుత్వం ఖతర్ సాయంతో కాబూల్ విమానాశ్రయం సహా దేశంలోని అనేక విమానాశ్రయాలను నడుపుతోంది. ఏరియాన ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్ విమానాలు ఇప్పటికే దేశీయ విమానాలను(డొమెస్టిక్ ఫ్లయిట్స్) నడుపుతోంది. అదేవిధంగా సెప్టెంబర్ 13న ఇస్లామాబాద్, కాబుల్ మధ్య అంతర్జాతీయ విమానం నడిచింది. ప్రస్తుతం కాబుల్ నుంచి పాకిస్థాన్, ఇరాన్‌లకు అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి.