మసూద్ దళాల ప్రకటన
కాబూల్: ‘సింహాల ప్రాంతంలోకి ఇతరులు ఎవరికి ప్రవేశం లేదు, ఇతరులు ఎవరిని అనుమతించేది లేదని అఫ్ఘనిస్థాన్‌లోని పంజ్‌షీర్ వీరులు ప్రకటించారు. తాలిబన్లు ఈ దుర్భేధ్యపు లోయలోకి ప్రవేశించారని వచ్చిన వార్తలను తాలిబన్ల ప్రతిఘటన దళాలు తోసిపుచ్చాయి. ఈ లోయ ప్రాంతాన్ని తాము అన్ని దిక్కుల నుంచి ఆక్రమించుకుంటున్నామని ఎప్పుడైనా తమ వశం అవుతుందని శనివారం తాలిబన్లు ప్రకటించారు. అయితే ఈ లోయ ప్రాంతానికి అధినేతగా ఉన్న అహ్మద్ మసూద్ అనుచరులు ఈ వాదన సరికాదని స్పష్టం చేశారు. అసలు పంజ్‌షీర్‌లో పోరు లేదని , తమతో పోరు సల్పే వారే లేరని , ఇక ఇతరులు ఎవ్వరో ఇక్కడికి చేరుకుంటారనే వాదన ఎందుకని ప్రశ్నించారు.
అహ్మద్ మద్దతుదార్లు చేసిన ప్రకటనను టోలోన్యూస్ వెలువరించింది. తమ ప్రాంతం ఇతరులకు దుర్భేధ్యం అని తమకు కంచుకోట అని ప్రతిఘటన బలగాల అధినేత అయిన మహ్మద్ అల్మాస్ జహిద్ తెలిపారు. అయితే లోయలో తమకు ఎటువంటి ప్రతిఘటన ఎదురుకావడం లేదని తాము చాలా ముందుకు నలు దిక్కుల నుంచి దూసుకువెళ్లుతున్నామని తాలిబన్లు చేసిన ప్రకటనను కూడా వార్తాసంస్థలు వెలువరించాయి. అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల ప్రాబల్యాన్ని ధిక్కరిస్తూ పంజ్‌షీర్ ప్రాంతంలో తాలిబన్ల చిరకాల ప్రత్యర్థి మసూద్ సారధ్యపు స్థానికులు అక్కడి లోయ ప్రాంతపు సాయుధ బలగాల సాయంతో ప్రతిఘటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇతర ప్రాంతాల్లోని లోయలు, కొండప్రాంతాల్లో కూడా తాలిబన్లకు ఎదురుగాలి వీస్తోంది.