అఫ్ఘన్‌లో డాక్టర్‌ను చంపేసిన తాలిబన్లు
కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లో రెండు నెలల క్రితం కిడ్నాప్ అయిన ప్రముఖ డాక్టర్ మెహమ్మద్ నదేర్ అలెమీ తాలిబన్ల చేతిలో దారుణ వధకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు శనివారం తెలిపారు. దేశంలోని ఉత్తరాది ప్రాంతపు నగరం మజర్ ఇ షరీఫ్‌లో ఈ హత్య జరిగింది. రెండు నెలల క్రితం తన తండ్రిని తాలిబన్లు ఎత్తుకెళ్లారని, డబ్బులకు బేరం పెట్టారని తాము మూడున్నర లక్షలు చెల్లించామని, అయినా ఎక్కువ సొమ్ము డిమాండ్ చేస్తూ చంపేశారని కుమారుడు రోహీన్ తెలిపారు. తాము డబ్బులు చెల్లించినా వినకుండా దారుణంగా చంపేసి, శవాన్ని రోడ్లపై పడేసి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనను తాలిబన్లు చిత్రహింసలు పాలుచేశారని, ఈ మేరకు ఒంటిపై గాయాలు ఉన్నాయని తెలిపారు. డాక్టర్ అలేమీ ప్రభుత్వ ఆసుపత్రిలో సైకియాట్రిక్‌గా పనిచేశారు. సొంతంగా ఓ ప్రైవేటు క్లినిక్ కూడా ఉంది. నగరంలో ఇదే తొలి ప్రైవేటు సైకియాట్రిక్ క్లినిక్. అత్యధిక సంఖ్యలోనే రోగులు ఇక్కడికి వస్తుంటారు. ఈ క్రమంలో ఈ డాక్టరు ఇక్కడ ప్రచారం పొందారు.