తొమ్మిది మంది మైనారిటీలను కిరాతంగా హత్య చేశారు: ఆమ్నెస్టీ
బెర్లిన్: అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల కిరాతకం జులై నెలలోనే మొదలైందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. గత నెల అఫ్ఘన్‌లోని హజారా మైనారిటీ తెగకు చెందినవారి ఇళ్లలోకి చొరబడి లూటీలు చేసిన తాలిబన్లు చాలామందిని చిత్రహింసలు పెట్టి చంపినట్లు ఆమ్నెస్టీ తెలిపింది. జులై 4 6తేదీల మధ్య ముందరఖ్త్ గ్రామానికి చెందిన తొమ్మిది మందిని తాలిబన్లు ఎలా హత్య చేశారో ఘాజ్ని ప్రావిన్స్‌కు చెందిన ఓ ప్రత్యక్ష సాక్షి తమ పరిశోధకులకు చెప్పాడని మానవ హక్కుల కోసం పోరాడుతున్న ఈ సంస్థ శుక్రవారం తెలిపింది.
వీరిలో ఆరుగురు మగవారిని కాల్చి చంపగా, మరో ముగ్గురిని చిత్రహింసలకు గురి చేసి చంపారని ఆ సంస్థ తెలిపింది. ఈ క్రూరమైన హత్యలు తాలిబన్ల గత చరిత్రను, వారి పాలన ఎలా ఉండనుందో మరో సారి గుర్తు చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చీఫ్ ఆగ్నెస్ కాలమర్డ్ చెప్పారు. ఇంకా చాలా హత్యలు జరుగుతున్నాయని, అయితే ఈ హత్యలకు సంబంధించిన ఫోటోలు పత్రికల్లో రాకుండా ఉండడం కోసం తాలిబన్లు తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో సెల్‌ఫోన్ సేవలను ఆపేస్తుండడంతో ఇవేవీ లెక్కల్లోకి రావడం లేదని కూడా ఆయన చెప్పారు.
taliban killed nine minorities in afghanistan