కాబుల్: ఆరు నెలల గర్భంతో ఉన్న ఒక మహిళా పోలీసును తాలిబన్లు ఆమె కుటుంబ సభ్యుల కళ్లెదుటే కాల్చి చంపివేశారు. అఫ్ఘాన్‌లోని ఘోర్ ప్రావిన్సులో ఈ ఘరో సంఘటన జరిగినట్లు ఒక ఆఫ్ఘాన్ జర్నలిస్టు ట్వీట్ చేశాడు. నిగరా అనే ఆ మహిళా పోలీసు అధికారి ఆరు నెలల గర్భిణి. ఆమె భర్త, పిల్లల కళ్లెదుటే ఆమెను తాలిబన్లు కాల్చి వేసినట్లు ఆ జర్నలిస్టు తెలిపాడు.ఇదిలా ఉండగా, బుర్ఖా లేకుండా కళ్లబడితే తాలిబన్లు తమను వేటాడి, వెంటాడి చంపివేస్తారన్న భయంతో అఫ్ఘాన్ మహిళలు హడావుడిగా తలను, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బుర్ఖాలను కొనుగోలు చేస్తున్నారని, 1990 దశకం నాటి పరిస్థితి పునరావృతమైందని స్పుత్నిక్ విలేకరి ఆదివారం తెలిపారు.
తాలిబన్ ప్రభుత్వంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ పెద్ద సంఖ్యలో అఫ్ఘాన్ మహిళలు హెరాత్‌లో ఆందోళనా ప్రదర్శనలు నిర్వహించిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. మళ్లీ 20 ఏళ్ల తర్వాత తాలిబన్లు అఫ్ఘాన్‌లో అధికారం చేజిక్కించుకున్న దరిమిలా అఫ్ఘానీ మహిళల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని కొన్ని విదేశీ మీడియా సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. తాలిబన్ల క్రూర పాలనంటేనే అఫ్గానీ మహిళలు భయంతో వణికిపోతున్నారని అఫ్గాన్‌కు చెందిన భద్రతా విశ్లేషకుడు సజ్జన్ గోహెల్ వ్యాఖ్యానించారు.