Sunday, December 22, 2024

తాలిబన్ పాలనలో మరొక బహిరంగంగా ఉరి శిక్ష

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో ఒక క్రీడా స్టేడియంలో వేలాది మంది సమక్షంలో ఒక హత్య నిందితుని తాలిబన్ సోమవారం బహిరంగంగా ఉరి తీసింది. ఇది గడచిన ఐదు రోజుల్లో అమలు చేసిన ఉరి శిక్ష మూడవది. ఉత్తర జవ్‌ఝాన్ ప్రావిన్స్ రాజధాని షిబిర్‌ఘన్ నగరంలో దట్టంగా మంచు కురుస్తుండగా ఉరి శిక్ష అమలు జరిగిందని, హతుని సోదరుడు ఒక రైఫిల్‌తో మూడు సార్లు దోషిపై కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. స్టేడియం పరిసరాల్లో భద్రత కట్టుదిట్టంగా ఉందని ఆయన చెప్పారు. మీడియాతో మాట్లాడేందుకు తనకు అధికారం లేనందున తన పేరు వెల్లడి చేయరాదన్న షరతుతో ఆయన ఈ విషయం తెలిపారు. తాలిబన్ 2021 ఆగస్టులో అధికారం చేజిక్కించుకున్న దరిమిలా ఇది బహిరంగంగా జరిగిన ఐదవ ఉరి శిక్ష.

రెండు దశాబ్దాల యుద్ధం అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్, నాటో దళాలు ఉపసంహరించుకుంటున్న చివరి వారాలలో తాలిబన్ మళ్లీ అధికారం చేజిక్కించుకున్న విషయం విదితమే. గతంలో మాదిరి కఠినంగా కాకుండా పాలన సాగిస్తామనని ఆదిలో వాగ్దానం చేసినప్పటికీ తాలిబన్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉరి తీతలు, కొరడా దెబ్బలు, రాళ్ల దెబ్బలు వంటి కఠిన శిక్షలను బహిరంగంగా అమలు చేయడం ప్రారంభించినందున తాజా పరిణామం దిగ్భాంతికరమైనదే. 1990 దశకం ద్వితీయార్ధంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పాలనలో మాదిరే శిక్షల అమలు జరుగుతోంది. తాజా శిక్షపై వ్యాఖ్యానించేందుకు తాలిబన్ ప్రభుత్వ అధికారులు వెంటనే అందుబాటులో లేకపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News