జవహరీ హత్యపై విచారణ ప్రారంభిస్తామని హామీ
ఇస్లామాబాద్ : అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో అమెరికా డ్రోన్ దాడిలో అల్‌ఖైదా అగ్ర నాయకుడు అమాన్ అల్ జవహరీ హతమైన కొన్ని రోజుల తరువాత తాలిబన్ పెదవి విప్పింది. జవహరీ హతుడైనట్టు అంగీకరించింది. దీనిపై విచారణ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. జవహరీ హత్య తరువాత తాలిబన్, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు మరింత బెడిసి కొట్టాయి. ఏడాది క్రితం అమెరికా సేనలు అఫ్గానిస్థాన్ నుంచి వైదొలగిన తరువాత ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోడానికి తాలిబన్ పశ్చిమ దేశాల నుంచి తక్షణం ఆర్థిక సాయం కోసం ఆకాంక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కాబూల్ లోనే జవహరి హత్య కావడం తాలిబన్‌కు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ పరిస్థితిని గమనించి తాలిబన్ ప్రభుత్వం తరఫున దోహా లోని రాజకీయ కార్యాలయ అధినేత సుహైల్ షాహీన్ ఆంగ్లపత్రికకు తన కథనం వినిపించారు.
తాలిబన్ ప్రభుత్వానికి లేదా నాయకత్వానికి అల్‌ఖైదా అగ్రనేత గురించి ఏమీ తెలియదని పేర్కొన్నారు. ఈ దాడి గురించి అమెరికా చెబుతున్న దానికి ఆయన వాదన విభిన్నంగా ఉంది. సీనియర్ తాలిబన్ నాయకుడు సిరాజుద్దీన్ హక్కానీ గృహం లోనే జవహరీ నివసించేవాడని అమెరికా చెబుతోంది. తాలిబన్ ఉపాధ్యక్షుడుగా హక్కానీ ఉంటున్నారు. అంతేకాదు తాలిబన్ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఆయన ఉన్నారు. తాలిబన్ ఉద్యమంలో శక్తివంతమైన వర్గమైన హక్కానీ నెట్‌వర్క్‌కు అధినేతగా ఉంటున్నారు. 2020 దోహా ఒప్పందంలో అల్‌ఖైదా సభ్యులకు తామెలాంటి ఆశ్రయం ఇవ్వబోమని అమెరికాకు తాలిబన్ హామీ ఇచ్చింది. అయితే అమెరికా వాదనలో ఎంతవరకు వాస్తవం ఉందో తాము దర్యాప్తు చేస్తున్నామని, ఈమేరకు తాలిబన్ నాయకత్వం నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోందని షాహీన్ పేర్కొన్నారు. వాస్తవాలు బయటపడ్డాక అందరికీ తెలియజేస్తామన్నారు.