Saturday, November 23, 2024

అఫ్ఘన్‌లో శాంతికి తాలిబన్ల మంత్రాంగం

- Advertisement -
- Advertisement -

Taliban talks with Former Afghanistan president

మాజీ నేతలతో చర్చలు
సవ్యమైన సర్కారు దిశలో
ఇప్పటికీ దక్కని విదేశీ గుర్తింపు
జలాలాబాద్‌లో ఘర్షణలు
మహిళలపై నిషేధానికి బ్రేక్?
కాబూల్‌లో ఇళ్లలోపలే జనం

కాబూల్: కల్లోల పరిస్థితులు కొనసాగుతూ ఉండగా, అంతర్జాతీయంగా తీవ్రస్థాయిలో విమర్శల నేపథ్యంలో తాలిబన్ల నాయకత్వం అగ్రస్థాయి రాజకీయ చర్చలు ఆరంభించింది. ఇంతకు ముందటి తాలిబన్ల అధికారం దశలో ప్రముఖ పాత్ర పోషించిన వారితో తాలిబన్లు గుర్తు తెలియని ప్రదేశంలో బుధవారం రహస్య చర్చలు ఆరంభించారు. తాలిబన్ల శాంతి మండలిలోని చిన్న వయస్కుడైన అనాస్ హక్కానీ దేశ మాజీ అధ్యక్షులు హమీద్ కర్జాయ్‌ను, సయోధ్య మండలి అధ్యక్షులు అబ్దుల్లా అబ్దుల్లాను కలిశారు. చాలా సేపటివరకూ చర్చలు జరిపారు. అయితే ఏ విషయాలపై చర్చలు జరిగాయనేది వెల్లడి కాలేదు. మరో వైపు తాలిబన్ల ఉప నేత ముల్లాహ్ అబ్దుల్ గనీ బారాదర్, మరో ఎనమండుగురు అత్యున్నత స్థాయి నేతలు ఖతార్ నుంచి కాందహార్‌కు వచ్చారు.

ఇప్పటికీ పలు దేశాలు పూర్తిస్థాయిలో తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించలేదు. అక్కడ జరిగిన మార్పును స్వాగతిస్తున్నామని, ప్రభుత్వం ఏర్పాటు తరువాతనే అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించే విషయం పరిశీలిస్తామని చైనా తెలిపింది. తాలిబన్లు తాము అధికారంలోకి వచ్చినప్పటికీ ఇంతకు ముందటిలాగా మహిళలపై నిషేధాలు, వారి వస్త్రధారణపై ఆంక్షల విషయంలో పట్టుదలకు వెళ్లడం లేదని స్పష్టం అయింది. పూర్తి స్థాయి బురఖా పద్ధతిని ఇంకా అమలులోకి తేలేదని తాలిబన్లు స్పష్టం చేశారు. అయితే వెంటనే ముఖాలకు ముసుగులు అవసరం అని తేల్చిచెప్పారు. తాము తిరుగుబాటుదార్లను ప్రభుత్వంగా గుర్తించేది లేదని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో తెలిపారు. తాలిబన్లపై భద్రతా మండలిలో తీవ్రస్థాయిలో విమర్శలు తలెత్తాయి. దీనితో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇతర దేశాలు సంయుక్త ప్రకటన వెలువరించాయి. పరిస్థితిని తాము జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్నామని, మానవ హక్కుల పరిరక్షణ ఏ విధంగా ఉంటేందనేది చూస్తామని తెలిపారు.

దీనిని బట్టే తమ తదుపరి నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకూ భారతదేశం నుంచి అఫ్ఘాన్ పరిణామాలపై కీలక ప్రకటన ఏదీ వెలువడలేదు. ముందుగా అక్కడి భారతీయుల భద్రతపై దృష్టిపెడుతున్నామని, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడం కీలకం అని భారతదేశం తెలిపింది. ఇప్పుడు అఫ్ఘన్ మాజీ అధ్యక్షులు హమీద్ కర్జాయ్ భేటీ జరిపిన నేతలలో ఒకరైన అనాస్ హకానీ పై అమెరికా 2012లో ఉగ్రవాద ముద్ర వేసింది. ఈ వ్యక్తిని అఫ్ఘనిస్థాన్‌లో తదుపరి ప్రభుత్వాలలోకి తీసుకుంటే ఆదేశంపై ఆంక్షలు తప్పవని అప్పటి ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే తాలిబన్లు తాము ఈ దేశాన్ని పూర్తి స్థాయిలో అఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ దేశం చేస్తామని ప్రకటించారు. అయితే ప్రపంచానికి అతీతంగా ఆంక్షలకు వెరవకుండా ఈ రాజ్య స్థాపన ఇందులో ఉగ్రవాదులకు ప్రాతినిధ్యం కల్పించడం కుదరని పని అనే వాస్తవిక నేపథ్యంలో బుధవారం జరిగిన నేతల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాబూల్ వీధులలో తీవ్రస్థాయి ఉద్రిక్తలు లేనప్పటికీ జనమంతా ఇళ్లకు పరిమితం అయ్యారు.

మహిళా గవర్నర్‌కు కస్టడీ

అఫ్ఘనిస్థాన్‌లోని ముగ్గురు మహిళా గవర్నర్లలో ఒక్కరైన సలీమా మజారీని తాలిబన్లు బుధవారం నిర్బంధంలోకి తీసుకున్నారు. ఛహర్‌కింగ్ బల్క్‌కు చెందిన హజారా ప్రాంత గవర్నర్ అయిన మజారి తమ ప్రాంతంలో తాలిబన్లు షాపులలోని షోకేసులలో ఉండే మహిళల బొమ్మలను పగులగొట్టడం వంటి చర్యలను అడ్డుకున్నారు. దీనితో ఆమెను తాలిబన్లు కస్టడీలోకి తీసుకున్నట్లు వెల్లడైంది. జలాలాబాద్‌లో తాలిబన్ల వ్యతిరేక ప్రదర్శనను అడ్డుకునేందుకు తాలిబన్లు కాల్పులు జరిపారు. ఇంతకు ముందటి ఆకుపచ్చ, ఎరుపు నల్లటి అఫ్ఘన్ ప్రభుత్వ జెండాను ఎగురవేసేందుకు ప్రజలు యత్నించారు. వారిపై తాలిబను ఫైటర్లు కాల్పులు జరిపారు. ఈ ప్రాంతంలో పరస్పర ఘర్షణలు దొమ్మిలు జరిగాయి. మరో వైపు తజికిస్థాన్‌లో తలదాచుకునేందుకు హుటాహుటిన వెళ్లిన మాజీ అధ్యక్షులు అష్రఫ్ ఘనీకి యుఎఇ ఆశ్రయం కల్పించింది. మానవతా కారణాలతో ఆయనకు కుటుంబానికి ఈ ఆసరా కల్పించినట్లు తెలిపింది.

3200 మంది అమెరికన్ల తరలింపు

అఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటివరకూ 3200 మంది అమెరికన్లను తరలించారు. వీరిని సురక్షితంగా స్వదేశం తీసుకువచ్చినట్లు వైట్‌హౌస్ వర్గాలు బుధవారం తెలిపాయి. మంగళవారం ఒక్కరోజే 1100 మందిని తీసుకువచ్చినట్లు వివరించారు. తాలిబన్లు పగ్గాలు చేపట్టిన తరువాత తమ దేశీయులకు రక్షణగా కొంత సైన్యాన్ని అమెరికా అక్కడనే ఉంచింది. వారి సాయంతో దశలవారిగా అమెరికన్లను విమానాలలో స్వదేశానికి తీసుకువస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News