కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు తమ పద్ధతి ప్రకారం వ్యవహరిస్తూ ఇప్పుడు దేశంలోని ఉద్యోగినులకు ఎసరు పెట్టారు. వారు ఇక ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని, వారికి బదులుగా వారి మగ బంధువులను డ్యూటీలకు పంపించాలని ఫర్మానా వెలువరించారు. మతాచారాల ప్రకారం స్త్రీల బహిరంగ సంచారం, సామాజికతపై కట్టడి దిశలో తాలిబన్లు పలు కటుతర చర్యలకు పాల్పడటం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ దశలో ఉద్యోగినులు జాబ్‌లు వీడాలనే పరోక్ష ఆదేశాలు వెలువరించారు. ఉద్యోగినులు తమ సమీప బంధువులైన మగవారిని తమ బదులు ఉద్యోగాలకు పంపించాలని ఫర్మానాలో తెలిపారు. తనకు తాలిబన్లనుంచి సదరు ఆదేశాలు అందాయని దేశంలోని మహిళా ఉద్యోగి ఒకరు వార్తాసంస్థలకు తెలిపారు. స్త్రీలు పని ఒత్తిడిని తట్టుకోలేరు. వీరి బదులు మగవారిని ఉద్యోగాలకు తీసుకుంటామని, కుటుంబ జీవనాధారం పోకుండా ఉండాలంటే ఉద్యోగినులు తమ ఇంటి మగవారిని పంపించి డ్యూటీలు చేయించాలని ఆదేశాలలో తెలిపారు.
గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు దేశాధికారం చేపట్టారు. అప్పటి నుంచి వెలువరిస్తూ వస్తున్న పలు డిక్రీలు మహిళల హక్కుల భక్షణ దిశలో ఉంటున్నాయి. తాలిబన్ల అధికారం ఆరంభం నుంచి తన వేతనం భారీగా తగ్గుతూ వచ్చిందని ఓ ఉద్యోగిని తెలిపింది. ఇంతకు ముందు తనకు 60000 అఫ్ఘనీలు వచ్చేవి. అయితే వీటిని ఇప్పుడు నెలకు 12000 అఫ్ఘనీలుగా మార్చివేశారని వాపొయ్యారు. ఇప్పుడు ఏకంగా తన బదులు మగవారిని ఉద్యోగాలకు పంపించాలని డిక్రీలు వెలువరించారని ఇదేం న్యాయం అని ప్రశ్నించారు. ఇదేమిటని తాను ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే బయటకు వెళ్లు,,,జీతాల కుదింపులపై మారుమాటలు లేవని గదమాయించారని, తాను కీలకమైన ఆర్థిక లావాదేవీల విభాగంలో ఉన్నానని, జీతం తగ్గింపుతో పలు రకాల ఖర్చుల బడ్జెట్ తలకిందులు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.