న్యూయార్క్ : అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అధికార స్థాపనతో ప్రపంచస్థాయిలో ఉగ్రవాదం బలోపేతమవుతుందని ఐక్యరాజ్య సమితి అధినేత ఆంటోనియో గుట్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలో పలు చోట్ల నిద్రాణంగా ఉంటూ వచ్చిన ఉగ్రశక్తులు అఫ్ఘన్ పరిణామాలతో తిరిగి మేల్కొనడమే కాదు బలోపేతం అయ్యేందుకు వీలుందని తెలిపారు. తాలిబన్ల విజయం నేపథ్యంలో తాను ప్రపంచ ఉగ్రవాదంపై తీవ్రంగా కలత చెందుతున్నట్లు చెప్పారు. ఐరాస ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ దేశంలో తాలిబన్లు అధికారంలోకి వచ్చారు. ఈ దశలో ఆ మిలిటెంట్ల బృందంతో తక్షణ సంప్రదింపులు జరగాల్సి ఉంది.
అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఇకపై తాలిబన్ల ప్రభుత్వం నుంచి నిర్మాణాత్మక పాత్ర అత్యవసరం అన్నారు. ఈ దిశలో తాలిబన్ల ప్రభుత్వాన్ని ఒప్పించే దిశలో ప్రపంచ దేశాలు వ్యవహరించాల్సి ఉందన్నారు. ఎప్పుడైతే తాలిబన్ల పాలనలోని అఫ్ఘనిస్థాన్ ప్రపంచ సాయిలో నిర్మాణాత్మక సంబంధాలకు తన వంతు పాత్ర పోషిస్తుందో అప్పుడు అవాంఛనీయ ఘటనలకు వీల్లేకుండా పోతుందని తెలిపారు. ఇప్పటికైతే తాలిబన్ల విజయం ఆందోళనకర పరిణామం అయింది. ఈ పరిణామంతో ఇతర ఇటువంటి బృందాలు లేదా సంస్థలు తమను తాము బలోపేతం చేసుకునేందుకు వీలేర్పడుతుందన్నారు. అంతర్జాతీయ సమాజం ముందు ఈ దిశలో కట్డడికి దిగాల్సి ఉంటుంది. తాలిబన్లతో పటిష్టమైన చర్యలతోనే అంతర్జాతీయ స్థాయిలో సవ్యమైన పరిష్కారానికి దారులు ఏర్పడుతాయని ఐరాస ప్రధాన కార్యదర్శి తెలిపారు.