Saturday, November 23, 2024

ఇంటికే పరిమితం కావాలని కాబూల్ మున్సిపాల్టీ మహిళా ఉద్యోగులకు హుకుం

- Advertisement -
- Advertisement -

Taliban Warns Female Workers To Stay Home

తాలిబన్ల హుకుంలు
మేయర్ జీ హుజుర్లు
తిరిగొచ్చిన పరదాల చరిత్ర

కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లో ఆడవాళ్లకు ఉద్యోగాలెందుకు? వారంతా ఇంటికే పరిమితం కావాలనే తాలిబన్ల సర్కారు ఆదేశాలు ఖచ్చిత రీతిలో అమలవుతున్నాయి. కాబూల్ నగరంలోని మున్సిపాల్టీకి చెందిన ఉద్యోగినులు ఇకపై విధులకు రావల్సిన అవసరం లేదని, ఇళ్లకు పరిమితం కావాలని కాబూల్ తాత్కాలిక మేయర్ హముదుల్లా నమోనీ ఆదివారం హుకుం జారీ చేశారు. తాలిబన్ల పాలకులు తమకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దీనితో ఇక్కడి మున్సిపాల్టీలో అతి కొద్ది మంది మహిళలే ఉద్యోగాలు చేసుకోవల్సి ఉంటుంది. మగవారు చేయలేని విధులు నిర్వర్తించే వారు తప్ప మిగిలిన ఉద్యోగినులు అంతా ఇకపై ఇంటిపట్టునే ఉండాలి.

కాబూల్‌ను నెల రోజుల క్రితం వశపర్చుకున్న తాలిబన్లు తమ మునుపటి తరహాలోనే స్త్రీలకు బురఖాలు వారి స్వేచ్ఛకు సంకెళ్లు పద్ధతినే పాటిస్తున్నారు. ఎక్కడికక్కడ కార్యాలయాలకు వచ్చే ఉద్యోగినులను సాయుధ తాలిబన్లు గేట్ల వద్దనే నిలిపివేస్తున్నారు. ఈ క్రమంలో తాము స్వేచ్ఛగా కార్యాలయాలలోకి వెళ్లి తమ డ్యూటీలు చేసుకునే తమను పరాయిలుగా చేసి, ఇంటికి పంపిస్తున్న తంతుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాలిబన్లను ఎదిరించలేక కుమిలిపోతున్నారు. స్థానిక మున్సిపల్ మేయర్ తాము పాలకుల ఆదేశాలనే పాటించడం జరుగుతుందని, అతి కొద్ది మంది మహిళలకు ప్రవేశం ఉంటుందని తేల్చిచెప్పారు. ఇస్లాం మతాచారాల పేరిట మహిళు పరదృష్టి కుదరదనే నిబంధనను తాలిబన్లు తూచా తప్పకుండా పాటిస్తూ తమ మునుపటి తంతును ఆచరించడంపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి.

అయితే ఎవరిపైనా నిషేధం ఉండదని, భేదభావనలేకుండా పాలన సాగిస్తామనే తొలి నాళ్ల వాగ్ధానాన్ని తాలిబన్లు ఇప్పుడు గట్టున పెట్టారు. 1990 పాలన రుచులను చూపిస్తున్నారు. అప్పట్లో తాలిబన్లు మహిళలు, బాలికలపై పలు ఆంక్షలు విధించారు. వారిని స్కూళ్లకు వెళ్లకుండా , ఉద్యోగాలు చేయకుండా, బురఖాలు వీడకుండా చూసుకున్నారు. ఆడాళ్లకు జన జీవితంతో ఏమి పని, ఇంటిలోపలి ప్రపంచానికి పరిమితం అయి, కుటుంబాన్నితమ పనిగా విధిగా చూసుకుని బతకాలని ఇదే ఇస్లామ్‌లోని షరియత్ పద్ధతి అని తేల్చిచెప్పారు. ఇప్పుడు కూడా క్రమేపీ అప్పటి ఆంక్షల నీడలే దేశవ్యాప్తంగా పర్చుకుంటున్నాయి.

ఇప్పటికీ స్కూళ్లకు రావద్దు తరువాతే చెపుతాం

ఇటీవలి కాలంలో తాలిబన్లు ఫత్వా తరహాలో వెలువరించిన ఆదేశాలలో విద్యార్థినులు ఎవరూ స్కూళ్లకు పోవద్దని, ఇప్పటికైతే ఈ ఆదేశాలు వెలువరిస్తున్నామని తెలిపారు. బాలలకు పోయిన వారం స్కూళ్లు ఆరంభం అయ్యాయి. స్కూళ్లు తెరుచుకున్నా తాము వెళ్లలేని స్థితితో విద్యార్థినులు ఇళ్లకే పరిమితం కావల్సి వచ్చింది. ఇక యూనివర్శిటీలకు వెళ్లే అమ్మాయిలు కాలేజీలలో ప్రత్యేక గదులలో లేదా పరదాలు ఏర్పాటు చేసిన హాళ్లలో విద్యాభ్యాసం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది.

మహిళా మంత్రిత్వశాఖ రద్దు

శుక్రవారం తాలిబన్లు మరో కీలక చర్యకు దిగారు. కాబూల్‌లో ఉన్న మహిళా మంత్రిత్వశాఖ కార్యాలయానికి ఉన్న బోర్డును తీసివేశారు. ఇకపై ఈ మంత్రిత్వశాఖ ఉండదని తెలిపారు. దీని బదులుగా ఇస్లామిక్ చట్టాల ప్రబోధానికి సంబంధించిన మంత్రిత్వశాఖ ఏర్పాటు అవుతుందని తెలిపారు. మంత్రిత్వశాఖ రద్దుపై స్థానికంగా కొందరు మహిళలు బృందంగా వచ్చి నిరసనలు తెలిపారు. అయితే వీరి సంఖ్య పల్చగానే ఉంది. మహిళలను ప్రధాన స్రవంతిలో లేకుండా ఇళ్లకు బందీ చేస్తారా? జనజీవితంలో మహిళకు ప్రాతినిధ్యం సముచిత స్థానం లేని సమాజం మృత సమాజం అవుతుందని తెలిపే ప్లకార్డులను ప్రదర్శించారు. తాలిబన్లు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? వారు తమ హక్కులను ఎందుకు హరిస్తున్నారు?

అని ప్రదర్శనకారులలో ఒక్కరైన 30 ఏండ్ల బసిరా తవానా ప్రశ్నించారు. అయితే ఆమె గొంతు వణుకుతూ ఉండటం కన్పించింది. తాము తమ హక్కుల కోసం తమ బిడ్డల బతుకుల కోసం ఈ విధంగా రోడ్డున పడాల్సి వస్తోందని తెలిపారు. వీరి ప్రదర్శన ఇక్కడ పది నిమిషాల పాటు జరిగింది. అక్కడున్న తాలిబన్లతో మహిళలు కొద్ది సేపు తగవు పడ్డారు. అయితే తరువాత వారు అక్కడున్న కారులో వెళ్లారు. ఇటీవలి కాలంలో తాలిబన్ ఫైటర్లు పలువురు మహిళా కార్యకర్తలను నిరసనలకు దిగకుండా అడ్డుకుంటున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News