తలుపులు, ద్వారబంధాలు లేని ఇంట్లోకి ప్రవేశించిన పులిలా తాలిబన్లు ఎటువంటి ఆటంకం, ప్రతిఘటన ఎదురుకాకుండా అత్యంత సునాయాసంగా అఫ్ఘానిస్థాన్‌ను ఆక్రమించుకున్నారు. ప్రపంచాధిపత్యం వహిస్తున్న అమిత శక్తివంతమైన అమెరికన్ సైన్యం తోక ముడిచి పారిపోతుండగా తాలిబన్ దళాలు బోర విరుచుకొని అవలీలగా అఫ్ఘాన్‌ను ఆక్రమించుకున్న దృశ్యం ప్రజాస్వామ్య ప్రపంచం భవ్య మనుగడను కోరుకునే మానవీయ హృదయాలన్నింటినీ భయోతాతంలో ముంచివేసింది. అమెరికాను నమ్ముకుంటే అంతే సంగతులనే అభిప్రాయం గట్టిపడింది. తాలిబన్ల క్రౌర్యం గురించి తెలిసిన వారు ఈ పరిణామాన్ని బొత్తిగా జీర్ణించుకోలేరు. వారి కరకు కఠోర మతోన్మత్త పాలనను గతంలో చవిచూసిన అఫ్ఘానిస్థాన్ ప్రజలు, ఇతర దేశాల వారు ఆ దేశం విడిచిపెట్టి పోడానికి కాబూల్ విమానాశ్రయానికి పరుగులు తీసిన తీరు, అక్కడ అందుబాటులోని విమానాలు కిక్కిరిసి పోగా ఒక అమెరికన్ సైనిక విమానం నుంచి జారిపడి కొంత మంది దుర్మరణం పాలైన ఘటన భావి అఫ్ఘానిస్థాన్ దృశ్యాన్ని కళ్లకు కట్టింది. ఇస్లామిక్ చట్టాన్ని (షరియా) రాజీలేని రీతిలో అమలు పరిచే తాలిబన్ల పాలనలో మహిళలకు ఎటువంటి స్వాతంత్య్రం ఉండదనేది గత అనుభవ సత్యమే.
పది సంవత్సరాలు నిండిన ఆడపిల్లలు చదువుకోకుండా చూడడం, వివాహేతర సంబంధం పెట్టుకునే వారి తల నరకడం, దొంగతనానికి చేతులు తెగకోయడం, పురుషుడి తోడుతో మాత్రమే మహిళలు బయటికి వెళ్లాలనడం వంటి అమానుషమైన శిక్షలు, నిబంధనలు అమలు చేసే తాలిబన్ల ఏలుబడి కింద ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. అందుచేతనే కాబూల్ విమానాశ్రయంలో అటువంటి హృదయ విదారక ఘట్టాలు సంభవించాయి. 20 ఏళ్లపాటు అక్కడ అపార ధనరాశులు పోసి తన సైన్యాన్ని కాపలా ఉంచి అమెరికా చేసిందేమిటనే ప్రశ్నకు సమాధానం కరవవుతోంది. అఫ్ఘాన్‌లో ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మిస్తామన్న దాని ప్రతిజ్ఞ ఇంతగా రక్తసిక్తమవుతుందని ఎవరూ అనుకోలేదు. అరబ్ దేశాల్లో అమెరికా నిరూపించుకున్న పొగరు తాలిబన్ల విషయంలో ఏమైపోయింది అనే ప్రశ్న కూడా సమాధానం లేనిదిగా మిగిలిపోతున్నది. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అగ్రరాజ్యం చూరగొన్న అతి ఘోర పరాజయంగా ఇది చరిత్రలో నిలిచిపోతుంది. పూర్వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గీచిన సైనిక ఉపసంహరణ పటాన్ని యధావిధిగా అమలు చేయడం తప్ప జో బైడెన్ అఫ్ఘాన్ విషయంలో కొత్తగా చేసిందేమీ లేదు.
తాలిబన్ల బలమేమిటి, వారు విరుచుకుపడితే దేశ దేశాల రాయబార కార్యాలయాలు, వాటి ప్రజలున్న కాబూల్ నగరం గాని, మిగతా దేశంగాని ఏమైపోతాయి, అక్కడి ప్రజా జీవనం ఎటువంటి కల్లోలాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది అనే విషయాలకు బైడెన్ ప్రభుత్వం బొత్తిగా ప్రాధాన్యమిచ్చినట్టు కనిపించడం లేదు. 2020 ఫిబ్రవరిలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కళ్లు మూసుకొని తాలిబన్లతో సంతకం చేసిన శాంతి ఒప్పందం తన ఉనికిని అణుమాత్రమైనా చూపించలేక ఇలా కుప్పకూలిపోయింది. తాలిబన్లకు, ఇప్పటి వరకూ అక్కడున్న అఫ్ఘాన్ ప్రభుత్వానికి మధ్య అధికార విభజన లక్షంగా ఆ ఒప్పందం కుదిరింది. చివరికి తాలిబన్లు ఏకపక్షంగా నిర్నిరోధంగా అఫ్ఘాన్‌ను ఆక్రమించుకున్నారు. వారితో ఒప్పందం సాధించే విషయంలో అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్ మీద ఎక్కువగా ఆధారపడి విఫలమైంది. ఇది అమెరికా, పాక్ భావి సంబంధాల మీద ప్రభావం చూపించవచ్చు. తాలిబన్ల ఏలుబడి అమానుషంగా ఉంటుందని తెలిసి కూడా చైనా, పాకిస్థాన్‌లు వారికి మద్దతు తెలపడం విషాదకర పరిణామం. ఇంకా మరి కొన్ని దేశాలు మద్దతు తెలిపే అవకాశమున్నది.
ఈ నేపథ్యంలో తాలిబన్లను అక్కడి నుంచి తరిమివేసే శక్తి ఉండబోదనేది కాదనలేని బాధాకరమైన సత్యం. అఫ్ఘానిస్థాన్ పరిణామాలను ప్రపంచం భారమైన హృదయంతో పరిశీలిస్తున్నదని అక్కడ నెలకొనబోయే పరిస్థితుల పట్ల ఆవేదన చెందుతున్నదని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి తాలిబన్లనుద్దేశించి పంపిన సందేశంలో పేర్కొనడం గమనించదగినది. మానవ హక్కులను కాపాడవలసిందిగా తాలిబన్లను ఆయన వేడుకున్నారు. అఫ్ఘాన్ ప్రజలు వణికిపోతున్న తీరు గమనించిన తాలిబన్లు తాము ఎటువంటి హాని చేయబోమని అందరికీ క్షమాభిక్ష పెడుతున్నామని ప్రకటించారు. మహిళలు ఉద్యోగాన్ని చేసుకోవచ్చని కూడా భరోసా ఇచ్చారు. ఆచరణలో ఏమి జరుగుతుందో చూడాలి. ఇండియాకు తాలిబన్లు బద్ధ శత్రువులనే విషయం తెలిసిందే. అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణ కృషిలో భారత్ విశేషంగా పాల్గొన్నది. ఒక సమాచారం ప్రకారం అఫ్ఘానిస్థాన్‌లో భారత్ 3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. తనకు అమిత్ర దేశమైన పాకిస్థాన్‌తో తాలిబన్లకు గల సఖ్యత భవిష్యత్తులో భారత్‌కు తలనొప్పి పెంచే అవకాశమే ఉంది. అందుచేత తాలిబన్ల పాలనలోని అఫ్ఘాన్‌తో ఆచితూచి వ్యవహరించవలసిన బాధ్యత భారత పాలకులపై ఉంది.