Wednesday, January 22, 2025

ప్రాజెక్ట్ రూపు రేఖలు మారేనా..!

- Advertisement -
- Advertisement -

తాలిపేరు ప్రాజెక్టు మెయింటెనెన్స్ పనులు ఎన్నడో..!
మన తెలంగాణ/చర్ల:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు రూపు రేఖలు ఇంకెన్నడు మారేనన్న ప్రశ్నలు రైతుల్లో తలెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంత రైతుల వరప్రదాయనిగా మారిన తాలిపేరు నిధుల లేనితో కొట్టుమిట్టాడుతోంది. గత కొన్నేళ్లుగా ప్రాజెక్టుకు రంగులు వేయలేని పరిస్థితుల్లో ఇటీవల ప్రాజెక్టు రంగులకు నిధులు మంజూరు అయ్యాయి. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. ప్రాజెక్టు అధికారుల చొరవతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రంగుల కల మాత్రం నెరవేర నుండగా ఇతర అత్యవసర పనులు మాత్రం నిలిచిపోయాయి.

ప్రాజెక్ట్ ఆధునిక కరణ పనుల్లో భాగంగా నిర్మించిన మూడు గేట్ల నిర్మాణ పనులు దాదాపు 8 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీంతోపాటు ప్రాజెక్టులో మెకానిక్ పనులు సైతం జరగాల్సి ఉంది. ప్రస్తుతం జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో సాంకేతిక పనులు పూర్తికావస్తున్నాయి. ముందస్తుగా వరదలను గుర్తించడం, గేట్ల ఆటోమేటిక్ ఆపరేటింగ్ తో పాటు ప్రాజెక్టు స్థితిగతులను ఎప్పటికప్పుడు సిడబ్ల్యుసికి అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే యేటా నిర్వహించే మెయింటెనెన్స్ పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. గ్రీజింగ్ తో పాటు ఇతర ఇతర పనులను ఖరీఫ్ కు ముందు చేయాల్సి ఉంది.

సిబ్బంది లేమితో ఇబ్బంది

ప్రాజెక్టులో దాదాపు 30 మంది వరకు సిబ్బంది ఉండాల్సి ఉండగా 9 మంది మాత్రమే ఉన్నారు. ఎలక్ట్రిషన్లు, ఎంఎంలు, ఫిట్టర్‌లు, పంపు ఆపరేటర్లు, జనరేటర్ ఆపరేటర్లు ఇలా సాంకేతిక సిబ్బంది ప్రాజెక్టులో కనీసం సీజన్ సమయంలో అయినా ఉండాల్సి ఉంది. అలాంటిది కొద్ది మంది సిబ్బందితోనే అధికారులు నానా కష్టంగా నడిపించుకుంటూ వస్తున్నారు. మూడు షిఫ్టుల్లో వివిధ విభాగాల్లో పని చేయాల్సిన సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో అధికారులకు సైతం వరదల వేళ ఇబ్బందిని కలిగిస్తుంది. ప్రాజెక్టులో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేమి సమస్యకు పరిష్కారం లభించడం లేదు. అధికారులు ప్రాజెక్ట్ సిబ్బంది భర్తీ కోసం ప్రతిపాదనలు పంపిన అవి బుట్ట దాఖలవుతున్నాయి. వర్షాకాలంలో ఉన్న కొద్ది పాటి సిబ్బందితోనే ఏటా ప్రాజెక్టు నిర్వహణను అధికారులు నెట్టుకొస్తున్నారు.

అత్యవసర పనులు ఎన్నడు

తాలిపేరు ప్రాజెక్టులో అత్యవసరంగా చేపట్టవలసిన పనులలోను నిధులు లేని సమస్య వెంటాడుతుంది. ఫలితంగా ఈ పనుల్లో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ప్రధానంగా గ్యాలరీలో గ్రౌటింగ్ పనులు చేయాల్సి ఉండగా ఎన్నో సంవత్సరాలుగా ఈ పనులు నిధులు లేమి తో పూర్తి కావడం లేదు, గ్యాలరీలో లీకేజీల కారణంగా వివిధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్యాలరీలో ఎప్పటికప్పుడు లీకేజీ నీటిని ఎత్తిపోయడం భారంగా మారుతుంది. లీకేజీలను అరికట్టే గ్రౌటింగ్ పనులు అత్యవసరంగా చేయాల్సి ఉంది. ప్రాజెక్టులో హై లెవెల్ బ్రిడ్జిపై మెకానికల్ పనులు సైతం అత్యవసరంగా చేయాల్సి ఉంది. విద్యుత్తీకరణ పనులు సైతం పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది. గేరు బాక్సులు మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఇలా మెకానికల్ పరిధిలోని అనేక పనులు ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో చేయాల్సి ఉంది.

మూడు గేట్లు పూర్తి ఎన్నడో

ప్రాజెక్టులో 2006లో ప్రమాద స్థాయికి మించి వరద రావడంతో అధికారులు అదనంగా మూడు గేట్లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తాలిపేరు ప్రాజెక్ట్ ఆధునీకీకరణ పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనుల్లో భాగంగా దాదాపు 12 కోట్లతో నిర్మించిన అదనపు గేట్ల నిర్మాణం గత కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా మిగిలిపోయింది. దీని కోసం ప్రత్యేకంగా రింగ్ బండ్ ఏర్పాటు చేశారు. అదనపు గేట్ల నిర్మాణ పనుల్లో భాగంగా గేట్లను అమర్చినప్పటికీ హై లెవెల్ వంతెన పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. ఈ పనులు పూర్తి చేయాలని రైతుల ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్న పనులు మాత్రం ఏళ్ల తరబడి ప్రారంభానికి నోచుకోవడం లేదు.

కాల్వల మరమ్మతులు ఇంకెన్నడు

తాలిపేరు మధ్య తరగతి ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన ఎడమ, కుడికాలు అధికారులు మరమ్మతులు మరిచారు. ఈ పనులు సైతం నిధులు లేమితో జాప్యం జరుగుతుంది. ప్రధాన ఎడమ కాలువ చర్ల దుమ్ముగూడెం మండలాల పరిధిలోని 40 కిలోమీటర్ల పైగా ఈ కాలువలో పూడికతీత పనులు చేయాల్సి ఉంది. ప్రధానంగా స్ట్రక్చర్లు పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరినప్పటికీ వాటిని బాగు చేసే పరిస్థితి లేదు, ఇటీవల కాలంలో కాలువలకు గండ్లు పడి సాగునీటి కడగండ్లను రైతులు ఎదుర్కొన్నారు. ప్రధాన ఎడమ కాలువ సైతం గండ్లు పడటంతో అధికారులు నానా అవస్థలు పడి గండ్లు పూడ్చినప్పటికీ శాశ్వత పనులకు నిధులు లేని వెంటాడుతోంది. యూటీలు, వంతెనలు ఇతర ఇతర స్ట్రక్చర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలవలో లైనింగ్ సైతం పడిపోవడంతో ఎక్కడికక్కడ చెట్లు పెరిగి కాలువ అడవిని తలపిస్తుంది. ప్రధాన కుడి కాలువ సైతం అక్కడక్కడ మరమ్మతులు చేయాల్సి ఉంది.

డిస్ట్రిబ్యూటర్ల సైతం అధ్వానంగా తయారయ్యాయి

ప్రాజెక్టు ఎగువ అత్యంత క్యాచ్ మెంట్ ఏరియా ఉండటంతో రిజర్వాయిర్ ఇట్టే ఎగువన చిన్నపాటి వర్షం కురిసిన నిండుకుండగా మారుతుంది. ఖరీఫ్ కాలంలో సాగునీటికి డోకా లేకుండా రైతులకు వరప్రదాయంగా మారిన తాలిపేరు కు ఇకనైనా నిధులు మంజూరు చేసి తాలిపేరు రూపురేఖలు మార్చాలని రైతుల కోరుకుంటున్నారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో దాదాపు పాతికవేల ఎకరాల ఆయకట్టుకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు విడుదల అవుతుంది. తాలిపేరు ప్రధాన ఎడమ, కుడి కాలువల పరిధిలో 42 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా సాగునీరు విడుదలవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News