రాష్ట్ర సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేక సోయి లేని పనులు
కెసిఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే క్రమంలో తిర్రిమొర్రి వ్యవహారాలు
అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ వైఫల్యాలను గట్టిగా నిలదీయాలి
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలి రైతుభరోసా,
రుణమాఫీ, లగచర్ల ఘటన, మూసీ సుందరీకరణ, హైడ్రా చర్యలు
క్షమించరానివి బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ వ్యాఖ్యలు
శాసనసభా పక్ష సమావేశంలో నేతలకు దిశానిర్దేశం
మనతెలంగాణ/హైదరాబాద్/గజ్వేల్ జోన్ : ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తి కొట్లాడాలని తమ పార్టీ అధినేత కెసిఆర్ సూచించారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కెసిఆర్ మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పారు. రుణమాఫీ అరకొరగా చేశారని, ఇప్పటివరకు రైతు భరోసా రాలేదని అన్నారు. కొనుగోలు కేంద్రాలు సరిగ్గా నడవని పరిస్థితి ఉందని ఆక్షేపించారు.
బోనస్ ఇవ్వకుండా రైతులను దగా చేశారని మండిపడ్డారు. ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. విజయోత్సవాల పేరిట రైతులను అవమానిస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బిఆర్‌ఎస్ పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో పార్టీ అధినేత కెసిఆర్ సమావేశం నిర్వహించారు. సమావేశం ముగిసిన తర్వాత పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో కలిసి కెటిఆర్ మీడియా మాట్లాడుతూ, అన్ని అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. రైతుల గొంతుకగా అసెంబ్లీ, శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.
గురుకులాల్లో అధ్వాన్న పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల బాట ద్వారా బిఆర్‌ఎస్‌వి గురుకులాలను పరిశీలించిందని, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ కెసిఆర్‌కు నివేదిక ఇచ్చిందని తెలిపారు. గురుకులాలపై మాజీ మంత్రులు సబిత, జగదీశ్ రెడ్డి సలహాలు, సూచనలు అందించారన్నారు. గురుకులాలను సంస్కారవంతంగా నడిపేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కెసిఆర్ సూచించారని, గురుకులాల్లో పరిస్థితులను కళ్లకు కట్టినట్టు ప్రభుత్వం దృష్టికి తేవాలని ఆదేశించారని అన్నారు.
రాష్ట్రంలో దౌర్జన్యకాండ జరుగుతోంది
రాష్ట్రంలో దౌర్జన్యకాండ జరుగుతోందని కెటిఆర్ మండిపడ్డారు. కొడంగల్, సంగారెడ్డి లాంటి ప్రాంతాల్లో దళిత, గిరిజన రైతులపై ప్రభుత్వం దాడులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు పెట్టి, నిర్బంధించి ప్రభుత్వం రైతుల భూములు లాక్కుంటోందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఫార్మాసిటీ కోసం ఇప్పటికే 14 వేల ఎకరాలు సేకరించి పెట్టాయని చెప్పారు. ఫార్మాసిటీ ఉంటుందని హైకోర్టుకు చెప్పారని, మళ్లీ 20 ఫార్మా విలేజ్‌లకు ఎందుకు తెరలేపారని ప్రశ్నించారు. దళిత, గిరిజన, చిన్న, సన్నకారు రైతులకు బిఆర్‌ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
పట్నం నరేందర్ రెడ్డి సహా 40 మంది రైతులు జైళ్లలో ఉన్నారని, వారందరినీ తక్షణమే విడుదల చేసి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలపై ఎక్కడికక్కడ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థులను కలవకుండా ఎంఎల్‌ఎ కోవా లక్ష్మిని గృహ నిర్బంధం చేశారని, దళితబంధు అడిగినందుకు ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందని, సర్కారు అరాచకాలపై అసెంబ్లీలో నిలదీస్తామని అన్నారు.
తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి అస్థిత్వంపై దాడి చేస్తున్నారు
తెలంగాణ ఉద్యమం, చరిత్రపై ప్రభుత్వానికి అవగాహన లేదని కెటిఆర్ విమర్శించారు. తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చి అస్థిత్వంపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూర్ఖంగా, అనాలోచితంగా తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని పేర్కొన్నారు. ప్రజల ఆవేదనకు బిఆర్‌ఎస్ గొంతుకగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన పనిని అసెంబ్లీ, మండలిలో నిలదీస్తామని వెల్లడించారు.
గ్రామ పంచాయతీల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. పిచికారీ మందులకు కూడా పైసల్లేవని, తాజా మాజీ సర్పంచులకు బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. పల్లెల దీన స్థితిపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షలు ఇస్తామన్నారని, కానీ ఇప్పటివరకు దళితబంధుకు రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. దళితబంధు నిధులపై, బిసి డిక్లరేషన్‌పై అసెంబ్లీలో సర్కారును నిలదీస్తామని, ప్రజాసమస్యలపై ప్రతి రోజు అసెంబ్లీలో ప్రశ్నలు సంధిస్తామని తెలిపారు.