న్యూఢిల్లీ : పోలింగ్ బూత్ వారీ వోటర్ల హాజరు డేటాను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్న డిమాండ్‌పై చర్చించేందుకు తాము సుముఖంగా ఉన్నామన్న భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) ప్రకటనను సుప్రీం కోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకున్నది. తమ వాదనలను పది రోజుల్లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించవలసిందిగా పిటిషనర్లను సుప్రీం కోర్టు కోరింది. టిఎంసి ఎంపి మహువా మొయిత్రా, ఎన్‌జిఒ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఎడిఆర్) 2019లో దాఖలు చేసిన రెండు పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు సంజయ్ కుమార్, కెవి విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ ముగిసిన 48 గంటలలోపే తమ వెబ్‌సైట్‌లో పోలింగ్ బూత్ వారీ వోటర్ల హాజరు డేటాను అప్‌లోడ్ చేయవలసిందిగా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిల్‌లు కోరాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) జ్ఞానేశ్ కుమార్ సమావేశమై, ఆ సమస్యపై చర్చించాలని కోరుకుంటున్నారని ఎన్నికల కమిషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది మణీందర్ సింగ్ తెలిపారు. ‘ఇప్పుడు కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉన్నారు. పిటిషనర్లు ఆయనను కలుసుకోవచ్చు, సమస్యను పరిష్కరించుకోవచ్చు’ అని ఆయన సూచించారు. ‘ఈ లోగా పిటిషనర్లు (ఎన్‌జిఒ, ఎంపి) తమ వినతిపత్రాన్ని ఎన్నికల కమిషన్ వద్ద దాఖలు చేయవచ్చునని, ఇసి వారికి విచారణ తేదీ ఇచ్చి, ముందుగా ఆ విషయం తెలియజేస్తుందని, వినతిపత్రాన్ని పది రోజుల్లో ఇవ్వవలసి ఉంటుందని ఇసి న్యాయవాది చెబుతున్నారు’ అని సిజెఐ తెలిపారు. ఈ విషయమై విచారణను కోర్టు జూలై 28కి వాయిదా వేసింది.