Saturday, December 28, 2024

లండన్‌లో ఘనంగా ‘టాక్ – చేనేత బతుకమ్మ -దసరా’ సంబరాలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు యుకె నలుమూలల నుండి మూడు వేలకుపైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపి సీమ మల్హోత్రా, స్థానిక హౌంస్లౌ మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే స్పూర్తితో రాష్ట్ర మంత్రి కెటిఆర్ కృషికి తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం మాదిరిగా మంగళవారం వేడుకలను ‘చేనేత బతుకమ్మ …దసరా’ గా జరుపుకున్నామని ఎన్‌ఆర్‌ఐ బిఆర్‌ఎస్,యుకె అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి తెలిపారు.

టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో కవితక్క వెన్నంటి ఉండి ప్రోహించారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసి ప్రవాస సమాజంలో టాక్ ప్రత్యేక గుర్తింపును పొందిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్మున తెలిపారు.తమ పిలుపు మేరకు హాజరైన ప్రవాసులు చేనేత బట్టలు ధరించి పాల్గొనడం తమకెంతో సంతోషాన్ని, స్ఫూర్తినిచ్చిందని టాక్ ఉపాధ్యక్షురాలు శుష్ముణ రెడ్డి,స్వాతి బుడగం,క్రాంతి రేతినేని,జాహ్నవి దూసరి, శ్రావ్య వందనపు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

ఉపాధ్యక్షుడు సత్య చిలుముల మాట్లాడుతూ, దసరా పండుగ సందర్బంగా స్వదేశం నుండి తెచ్చిన శమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన ‘దసరా అలాయ్ బలాయ్’ కార్యక్రమంలో చేనేత శాలువాలను ఒకరికొరకు పరస్పరం వేసుకొని, జమ్మి (బంగారం)ని ఇచ్చి పుచ్చుకొని శుభాకాంక్షలు తెలుపుకొని, చేనేతకు చేయూతగా వీలైనన్ని సందర్భాల్లో చేనేత బట్టలు దరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. జమ్మి ఆకులు పంచుకుంటూ లండన్ పట్టణానికి ‘అలాయ్ బలాయ్’ల తెలంగాణ స్నేహమాధుర్యాన్ని ప్రత్యక్షంగా రుచి చూపించారని పలువురు ప్రశంశించారు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ, దసరా పండగ సందర్బంగా మహిళలందరు భక్తిశ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా గౌరీ దేవికి పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కలుపుతూ, రంగు రంగుల బతుకమ్మలతో సందడి చేశారు. విదేశాల్లో స్థిరపడ్డా కానీ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడటం అందరినీ ఆకట్టుకుంది. చిన్నారులు సైతం ఆటల్లో పాల్గొనడం కాకుండా, చిన్న చిన్న బతుకమ్మలతో సంబరాలకు కొత్త అందాన్ని తెచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ప్రవాస సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చేనేత పేరుతో బతుకమ్మ వేడుకల్ని నిర్వహించడం వినూత్నంగా ఉందని, వీరి ప్రయత్నం ఫలించి నేత కుటుంబాలకు మేలు జరగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పేలా బతుకమ్మ ను ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తునందుకు టాక్ సంస్థను పలువురు అభినందించారు.

UK 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News