హెచ్చరించిన జిన్‌పింగ్.. దీటుగా స్పందించిన అమెరికా అధినేత
బీజింగ్: అమెరికా,-చైనా అధినేతల మధ్య మాటల తూటాలు పేలాయి. పరస్పరం ఘాటు హెచ్చరికలు జారీ చేసుకొన్నారు. గురువారం బైడెన్-జిన్‌పింగ్ మధ్య రెండున్నర గంటల సమావేశం సెగలు పుట్టించింది. ఇరు దేశాల మధ్య విభేదాలను ఈ భేటీ మరోసారి తేటతెల్లం చేసింది. ఇరువురు నేతలు ముఖాముఖి భేటీ కావడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఒక్కటే చెప్పుకోదగ్గ పరిణామం. తెరవెనుక అమెరికా ఏదో అనుమానిస్తోంది.. అందుకే ఇటీవల ఆ దేశం తీసుకొన్న నిర్ణయాలు చాలా వరకూ చైనాను దృష్టిలో పెట్టుకొనే ఉంటున్నాయి.
తైవాన్ విషయంలో తగ్గేదేలే..
అమెరికా,-చైనా అధ్యక్షుల చర్చల్లో తైవాన్ ప్రధానాంశంగా మారింది. త్వరలో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైపే సందర్శించనుందనే వార్తలను దృష్టిలో పెట్టుకొని షీ జిన్‌పింగ్ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజాభిప్రాయాన్ని ఉల్లంఘించకూడదు. ఒక వేళ మీరు నిప్పుతో చెలగాటం ఆడితో మీకే కాలుతుంది. అమెరికా ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటుందని ఆశిస్తున్నా’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించినట్లు చైనా వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు అమెరికా ఇంత కఠినంగా కాకపోయినా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. ‘తైవాన్ విషయంలో అమెరికా పాలసీ మారలేదన్న విషయాన్ని బైడెన్ గుర్తు చేశారు. కానీ, ఏకపక్షంగా ప్రస్తుత పరిస్థితిని మార్చే యత్నం చేస్తే తైవాన్ జలసంధిలో శాంతి స్థిరత్వం కొరవడుతుంది’ అని పేర్కొన్నట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. వీరి మధ్య ఆర్థిక సహకారం, ఉక్రెయిన్ వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. నిప్పుతో చెలగాటం.. కామెంట్లు చేయడం చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే మాట్లాడారు. చైనాకు చెందిన దౌత్యవేత్తలు కూడా తైవాన్ విషయంలో ఇదే వాక్యాన్ని తరచూ వాడుతుంటారు. ఇప్పుడు జిన్ పింగ్ వ్యాఖ్యలు దానికి మరింత ప్రాధాన్యం తెచ్చాయి.