ప్రఖ్యాత తమిళ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూశారు. 80 సంవత్సరాల ఈ నటుడు 400కు పైగా సినిమాల్లో చిరస్మరణీయ పాత్రల్లో నటించారు. అంతకు ముందటి స్వల్ప అస్వస్థతతో శనివారం రాత్రి నివాసంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తండ్రికి వయోవృద్ధ అనారోగ్య సమస్యలు ఉన్నాయని, శనివారం రాత్రి ఓ టాబ్లెట్ ఇవ్వడానికి యత్నించగా ఆయనలో స్పందన లేదని, డాక్టర్లు వచ్చి పరిశీలించగా ఆయన మృతి చెందినట్లు నిర్థారణ అయిందని కుమారుడు మహాదేవ గణేష్ తెలిపారు. ఆయన మరణం పట్ల సినిమా ప్రముఖులు అనేకులు సంతాపం వ్యక్తం చేశారు. తిరునల్వేలిలో జన్మించిన గణేష్ సినీ ప్రస్థానం 1960లో ఆరంభమైంది. డబ్బింగ్‌లో పేరొందిన ఆయన డబ్బింగ్ గణేష్‌గా కూడా మార్మోగారు. ఢిల్లీలో ఉంటూ ఆయన పలు నాటకాలలో చిన్న చిన్నచిన్న పాత్రలు వేసేవాడు. విద్యాధికులు అయిన గణేష్ భారతీయ వాయుసేనలో పది సంవత్సరాల పాటు క్షేత్రస్థాయి ఉద్యోగిగా పనిచేశారు. తనకు నటనపై ఉండే మక్కువను చాటుకుంటూ వచ్చారు. తరువాత ఉద్యోగాన్ని వదిలి , స్వస్థలం అప్పటి మద్రాసుకు చేరుకున్నారు.
నటుటు ఖటాడి రామమూర్తి కళా బృందంలో చేరి, నాటకాలలో కీలక పాత్రలు పోషించారు. డౌరీ కళ్యాణం ఆయనకు బాగా పేరు తెచ్చింది. 1977లో దర్శకులు కె బాలచందర్ గణేష్‌కు తన పట్టినప్రేవసం చిత్రంలో తొలిసారి అవకాశం ఇచ్చారు. దీనితో ఆయన ఇక తిరుగులేకుండా కోలీవుడ్‌లో ముందుకు సాగారు. సరైన వాచకం, ఆకట్టుకునే నటనా తీరు ఆయనకు పేరు తెచ్చింది. రజనీకాంత్, కమల్‌హాసన్, విజయ్‌కాంత్ వంటి మేటి హీరోల పలు సినిమాలలో ఆయన ప్రధాన పాత్రలు పోషించారు. మణిరత్నం సినిమా నాయకన్‌లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది. మైకెల్ మదనకామరాజు , కమల్ సినిమా అప్పూల్లో పాత్రలతో ప్రేక్షకులకు మరీ దగ్గరయ్యారు.కె బాలచందర్ తీసిన అచ్చమిలై అచ్చమిలై సినిమాలో ఆయన పాత్ర సంచలనం కల్గించింది. సినిమాలతో పాటు రంగ స్థలంలో కూడా తన పాత్రలతో నటుడిగా ఆయన తుదివరకూ తన విశిష్టతను సాధించుకున్నారు.
ఢిల్లీలో ఎక్కువ కాలం ఉద్యోగరీత్యా ఉండటంతో ఆయన పేరు ముందు ఢిల్లీ వచ్చి చేరింది. ఢిల్లీ గణేష్‌గా ఆయన చిరస్థాయిగా నిలిచారు. ఆయన మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటని, ప్రత్యేకించి తమిళ చలనచిత్ర పరిశ్రకు విషాదం అని ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. ఆయన పలు పాత్రలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని తమ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి , ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ సంతాప సందేశం వెలువరించారు. హీరో రజనీకాంత్, మాధవన్, విజయ్‌సేతుపతి ఇతర ప్రముఖులు గణేష్ మృతికి సంతాపం వ్యక్తం చేసి, సహనటుడిగా ఆయన ప్రతిభను కొనియాడారు.