Wednesday, January 22, 2025

తెలుగు, తమిళ సినీ పరిశ్రమ ప్రేక్షకులను తక్కువచేయదు: నటి హుమా ఖురైషీ

- Advertisement -
- Advertisement -

ముంబై: హుమా ఖురైషీ ఇటీవల దక్షిణాది చిత్రాలలో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆమె హిందీ చిత్ర నటి అయినప్పటికీ తమిళంలో రజనీకాంత్ నటించిన ‘కాలా’(2018), అజిత్ నటించిన ‘వలిమై’(2022)లలో నటించి దక్షిణాది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. నేడు వివిధ భాషా చిత్ర సీమలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయన్నారు. “వాటి నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని గ్రహించారు. తమిళ, తెలుగు సినీ పరిశ్రమ తమ ప్రేక్షకులను తక్కువ చేసి మాట్లాడవు. పైగా అవి తమ హద్దులు చెరిపేసుకుని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. కథలు సమకాలీనమై ఉంటున్నాయి. సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తీకరించుకుంటున్నాయి. పెద్ద ఎత్తున ఆకట్టుకుంటున్నాయి. దక్షిణాది సినిమాలు పదేపదే విజయాలు సాధించుకుంటూ పోతున్నాయి” అన్నారు.
“ప్రస్తుతం బహుభాషా చిత్రాల ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయి. అందులో ప్రతి ఒక కళాకారుడు మమైకం అవుతున్నాడు. ప్రేక్షకాదరణ కూడా పెరుగుతోంది. నా రెండవ తమిళ చిత్రం ‘వలిమై’లో నటించడం వల్ల నేను చాలా థ్రిల్ ఫీలయ్యాను. రజనీకాంత్ సార్, అజిత్‌ల నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఓ నటిగానే కాదు, ఓ ప్రేక్షకురాలిగా కూడా చాలా నేర్చుకున్నాను. వారితో చేసిన పాన్‌ఇండియా చిత్రాల ద్వారా నేను చాలా ఉత్తేజానికి గురయ్యాను. అయినా దేశంలో ఇన్ని హద్దులెందుకు? నేడు మనం వీటిని చెరిపేయాలి” అని ఆమె చెప్పుకొచ్చారు.
హుమా ఖురైషీ ఈ ఏడాది ‘గంగూబాయి కథియావాడీ’ సినిమాలో షికాయత్ అనే పాటలో స్పెషల్ అప్పీరియన్స్‌గా కనిపించారు. తదుపరి ఆమె ‘తరల’ అనే సినిమాలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. అది ప్రముఖ చెఫ్ తరలా దలాల్ బయోపిక్. ఇంకా ఆమె ‘మోనికా, ఓ మై డార్లింగ్’ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. ఆమె నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్‌లో రాజ్‌కుమార్ రావు, రాధికా ఆప్టేల సరసన కూడా నటించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News