Monday, December 23, 2024

ఆసుపత్రిలో చేరిన తమిళ సినీ దర్శకుడు భారతీ రాజా

- Advertisement -
- Advertisement -

 

Bharati Raja

చెన్నై: సీనియర్‌ దర్శకుడు భారతీరాజా అనారోగ్యానికి గురై  చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం కుదురుగానే ఉంది. కాగా గుండెల్లో నిమ్ము చేరడం వల్ల అనారోగ్యానికి గురయ్యారని, రెండు రోజుల్లోనే సంపూర్ణ ఆరోగ్యంతో భారతీరాజా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతారని వైద్యులు తెలిపారు. అయితే సడన్‌గా శుక్రవారం ఆయనకు మెరుగైన వైద్యం కోసం  పోరూరులోని శ్రీరామచంద్రన్‌ ఆసుపత్రిలో చేర్చారు. భారతీరాజా కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రికి వచ్చిన గీత రచయిత వైరముత్తు అనంతరం మీడియాతో మాట్లాడారు. భారతీరాజా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ఇదిలావుండగా దర్శకుడు భారతీరాజా శనివారం మధ్యాహ్నం మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన తనకు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నందున తాను కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రిలోని విజిటర్స్‌ ప్రవేశానికి అనుమతి లేనందున తనను చూడడానికి ఎవరూ రావద్దని సూచించారు. తాను ఆసుపత్రిలో చేరిన విషయం తెలియగానే ప్రత్యక్షంగానూ, ఫోన్‌ ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా తనను పరామర్శించి, తాను త్వరలో కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. అయితే భారతీరాజా అనారోగ్యానికి కారణం ఏమిటన్నది ఇప్పటి వరకు వైద్యులు గాని, ఆయన కుటుంబ సభ్యులు గాని వెల్లడించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News