చెన్నై: కావేరీ జలాల వివాదం కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి దారితీస్తోంది. కావేరీ జలాల విడుదలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో తమిళ రైతులు మంగళవారం తీవ్ర నిరసనలకు దిగారు. కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అంతిమ సంస్కారం చేస్తూ రైతులు నిరసన తెలిపారు. కర్నాటక ప్రభుత్వ వైఖరికి నిరసన తెలియచేస్తూ నోట్లో చచ్చిన ఎలుకలను ఉంచుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. కావేరీ జలాలలను వెంటనే తమిళనాడుకు విడుదల చేయాలని వారు డిమాండు చేశారు.
మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిరసనను వ్యక్తం చేస్తూ కన్నడ ప్రజా సంఘాలు బెంగళూరు బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో బెంగళూరు వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం అర్థరాత్రి వరకు 144 సెక్షన్ విధించారు.