Wednesday, January 22, 2025

తమిళ సినీ దర్శకుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని ఉపయోగించడంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రసాదంగా అందచేసే పంచామృతంలో నపుంసకత్వాన్ని కలిగించే మందులను వాడారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ తమిళ దర్శకుడు జి మోహన్‌ను తమిళనాడు పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మోహన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు సంచలనం సృష్టించాయి.

ద్రౌపది, రుద్రతాండవం, బకాసురన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మోహన్‌ను తిరుచిరాపల్లి పోలీసులు మంటళవారం అరెస్టు చేశారు. ఆ ఇంటర్వూలో తిరుమల లడ్డూ వివాదాన్ని గురించి మోహన్ మాట్లాడుతూ తమిళనాడులో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయని అన్నారు. పురుషులలో లైంగిక సామర్ధాన్ని దెబ్బతీసి నపుంసకత్వానికి దారితీసే మందులను పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రసాదం పంచామృతంలో కలిపినట్లు తాను గతంలో విన్నానని మోహన్ చెప్పారు. ఆ వార్తలను దాచిపెట్టారని, పంచామృతాన్ని పారేశారని ఆయన చెప్పారు.

అయితే రుజువులు లేకుండా మనం మాట్లాడకూడదని, దీనిపై ఎవరూ వివరణ ఇవ్వలేదని కూడా ఆయన అన్నారు. కుటుంబ నియంత్రణ మాత్రలు హిందువులపై దాడిగా ఆ ఆలయ సిబ్బంది తనతో అన్నారని మోహన్ చెప్పారు. కాగా..మోహన్ వ్యాఖ్యలపై తమిళనాడు మత, ధార్మిక, దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు మండిపడ్డారు. పళని ఆలయ పంచామృతంపై తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇదిలా ఉండగా..దర్శకుడు మోహన్ అరెస్టును తమిళనాడు బిజెపి నాయకుడు అశ్వద్ధామన్ ఖండించారు. అరెస్టుకు కారణాన్ని మోహన్ కుటుంబానికి పోలీసులు తెలియచేయలేదని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News