ఆనందంతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
చెన్నై: ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పటినుంచి సంచలననిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్. తాజాగా ఆయన ఆర్‌టిసి సిటీ బస్సులో కొంత సేపు ప్రయాణించి అందరినీ ఆశ్చర్య పరిచారు. రాష్ట్రంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించేందుకు శనివారం ఆయన కణ్ణగి నగర్ ప్రాంతంలోని ఓ వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ ఆరోగ్య సిబ్బంది, టీకా తీసుకునే వారితో మాట్లాడి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఆర్‌టిసి సిటీ బస్సును చూసి తన కాన్వాయ్‌ని ఆపి బస్సెక్కారు. ఈ పరిణామంతో బస్సులోని డ్రైవర్, కండక్టర్‌తో పాటుగా ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ముఖ్యమంత్రిని చూసిన సంతోషంతో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. బస్సులో ఆకస్మిక తనిఖీ చేపట్టిన స్టాలిన్ ఆర్‌టిసి సౌకర్యాలపై ప్రయాణికులను ఆరా తీశారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులను ఉచిత టికెట్లు సరిగా ఇస్తున్నారా? ఉచిత టికెట్ల వల్ల ప్రయోజనం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. బస్సులో కొంత మంది మాస్కులు పెట్టుకోక పోతే మాస్కులు పెట్టుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో షేర్ చేయగా, ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాడు ఆర్‌టిసి సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ స్టాలిన్ ప్రభుత్వం గత జూన్‌లో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.