సోమవారం నాడు తమిళనాడు శాసన సభ సమావేశాల తొలి రోజున గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యవహరించిన తీరును గమనించే వారికి ఆయన తాను రాజ్యాంగ నియమ బద్ధమైన గవర్నర్‌ను కానని, ఆ రాష్ట్రానికి తిరుగులేని అధినేతనని భావిస్తున్నట్టు అర్థమవుతుంది. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఏదో ఒక చికాకుకు గురి చేస్తూ వుండడమే మీ పని అని ఆ రాష్ట్రాల గవర్నర్లకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెవిలో చెప్పి పంపించిందా అనే అనుమానం కూడా కలుగుతుంది. గవర్నర్ల విషయంలో రాజ్యాంగం నిర్దేశించిన విధి నిషేధాలను కాలరాయడమే కేంద్రంలో అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ లక్షమా అనే ప్రశ్న సైతం దూసుకొస్తుంది.
కొత్త సంవత్సరంలో జరిగే శాసన సభ మొట్టమొదటి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఆ ప్రసంగం ఆ రాష్ట్ర ప్రభుత్వం తయా రు చేసి ఇచ్చినదే కావడమూ సంప్రదాయమే. గవర్నర్ రాష్ట్రానికి రాజ్యాంగ అధిపతి కాబట్టి తన రాష్ట్ర ప్రభుత్వం తరపున దానిని సభలో యథాతథంగా చదివి వినిపించడం వరకే పరిమితం కావడమూ మామూలే. తమిళనాడు గవర్నర్ దీనిని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం దేశంలో బిజెపి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టిస్తున్నారో తెలియజేస్తున్నది. గవర్నర్ రవి డిఎంకె ప్రభుత్వం సిద్ధం చేసి ఇచ్చిన ప్రసంగ ప్రతిలోని కొన్ని భాగాలను విడిచిపెడుతూ తన ఇష్టావిలాసంగా దానిని చదివారు. ముఖ్యంగా డిఎంకెకి ప్రీతిపాత్రమైన ద్రావిడ పాలనా విధానం అనే దానికి సంబంధించిన భాగాన్ని వదిలివేశారు.అందులో పెరియార్, అంబేడ్కర్, కామరాజ్, అన్నాదురై, కరుణానిధిల ప్రస్తావన వుంది.వారు కట్టుబడిన సూత్రాలను, వారి ఆదర్శాలను అనుసరించి తన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ద్రావిడ నమూనా పాలనను అందిస్తున్నదని అందులో వుంది. గవర్నర్ దీనిని ప్రస్తావించకుండా పక్కన పెట్టారు.
అలాగే తమిళనాడు శాంతి భద్రతలతో అలరారుతున్నదని, అనేక విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ అన్ని రంగాల్లోనూ ముందుంటున్నదని పేర్కొన్న పేరాను కూడా ఆయన వదిలిపెట్టారు. ఈ విషయాన్ని గమనించిన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ అందుకు సభా ముఖంగా నిరసన తెలపకుండా (మర్యాదగా వుండదని భావించి) గవర్నర్ చదివిన ప్రసంగానికి బదులు శాసన సభ్యులకు పంచిపెట్టిన అసలు ప్రతిలోని ప్రసంగాన్నే రికార్డులకు ఎక్కించాలని తీర్మానం ప్రవేశపెట్టించారు. దానితో గవర్నర్ రవి జాతీయ గీతాలాపన జరిగే వరకైనా వేచి వుండకుండా సభ నుంచి వెళ్ళిపోయారు. ఇంతకంటే నియమోల్లంఘన, సభా సంప్రదాయాలను అగౌరవపరచడం వేరేమైనా వుంటుందా, గవర్నరే ఇందుకు పాల్పడడం నగుబాటు కాదా? గవర్నర్ రవి ద్రావిడ భావన పట్ల తరచూ వ్యతిరేకత ప్రదర్శించడం గమనార్హం. 1994లో తమిళనాడులోనే దాదాపు ఇటువంటి పరిణామం ఒకటి సంభవించింది. అప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తరపున తమిళనాడు గవర్నర్‌గా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి వున్నారు. జయలలిత ముఖ్యమంత్రి. వారిద్దరి మధ్య నీరు కూడా నిప్పులా భగ్గుమనేది.
ఇద్దరూ ఇద్దరే. ఆత్మాభిమాన ధనులు. తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కేంద్రం పంపిన ఏజెంటుగా గవర్నర్ చెన్నారెడ్డిని జయలలిత పరిగణించేవారు. ముఖ్యమంత్రి జయలలిత తనను, తన పదవిని అగౌరవపరుస్తున్నారని గవర్నర్ చెన్నారెడ్డి అనుకొనేవారు. ఈ నేపథ్యంలో ఆ ఏడాది శాసన సభ నూతన సంవత్సర తొలి సమావేశాలను గవర్నర్‌ను ఆహ్వానించకుండానే జరిపించి వేశారు. ఇప్పుడు ఏదో ఒకానొక రాష్ట్రంలో అని కాకుండా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ గవర్నర్లు పచ్చి కేంద్రం ఏజెంట్లుగా మాత్రమే పని చేస్తున్నారు. ఇది కేరళలో, తెలంగాణలో కూడా చూడవచ్చు. ఈ ధోరణి ఎంత మాత్రం దేశహితమైనది కాదు. రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతికి అభ్యంతరం లేనంతవరకు గవర్నర్ ఆ పదవిలో కొనసాగుతారు. తనకున్న అతి కొద్ది ప్రత్యేకాధికారాలు మినహా గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గ సలహా మేరకే పని చేస్తారు. స్థూలంగా గవర్నర్ పరిస్థితి ఇది. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ప్రజలెన్నుకున్నవై వుంటాయి.
శాసన సభలో మెజారిటీ విశ్వాసాన్ని చూరగొన్నంత కాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రివర్గం అధికారంలో కొనసాగుతారు. అందుచేత అటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలోని ప్రభుత్వం సిఫారసుల మేరకే గవర్నర్ వ్యవహరించవలసి వుంటుంది. దీనిని బాహాటంగా అతిక్రమించడమే పనిగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని గవర్నర్లు ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. దీని మూలాలు రాజ్యాంగానికి, ప్రస్తుతం కేంద్రంలో గల పాలకులకు మధ్య గల వైరుధ్యంలో వున్నాయి. ద్రావిడ పార్టీ పాలనలోని తమిళనాడు గవర్నర్ ద్రావిడ పాలనా విధానం గురించి చెప్పుకొన్న పేరాను వదిలిపెట్టి ప్రసంగం చదవడం ఆ రాష్ట్ర ప్రజల అధికారాన్ని ధిక్కరించడమే. రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చాలనే కేంద్ర పాలకుల విస్తృతమైన కుట్రలో భాగంగానే ఇలా జరుగుతున్నదనుకోవాలి.