చెన్నై: లౌకికవాదం యూరోపియన్ భావన, చర్చికి రాజకు మధ్య జరిగిన ఘర్షన కారణంగా లౌకికవాదం అనే భావన ఏర్పడిందని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి వ్యాఖ్యానించారు. భారతదేశం ధర్మంతో ముడిపడి ఉంటుందని, అందుకే ఈ దేశంలో ఆ ఘర్షఆ రకమైన ఘర్షణ తలెత్తే అవకాశం లేదని ఆదివారం కన్యాకుమారిలో ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ దేశంలో ఆ విధమైన ఘర్షణలు ఉండవు కాబట్టే రాజ్యాంగంలో దీన్ని చేర్చలేదని, ఎమర్జెన్సీ కాలంలో లౌకికవాదం పదాన్ని రాజ్యాంగంలో చేర్చారని ఆయన తెలిపారు. ఈ దేశ ప్రజలను చాలారకాలుగా మోసం చేశారని, లౌకికవాదానికి తప్పుడు భాష్యం ఇవ్వడం కూడా అందులో ఒకటని ఆయన అన్నారు. అసలు సెక్యూలరిజం అంటే ఏమిటని ఆయన ప్రశ్నిస్తూ అది యూరోపియన్ భావనే తప్ప భారతీయ భావన కాదంటూ ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్యం వచ్చిన సమయంలో రాజ్యాంగాన్ని రచిస్తుండగా సెక్యూలరిజం గురించి చర్చ జరిగిందని, కాని దాన్ని రాజ్యాంగ సభ దాన్ని తిరస్కరించిందని రవి తెలిపారు.
భారత్ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుందని, యూరోపుత రహాలో ఇక్కడ ఘర్షణ పరిస్థితులు ఉండవని రాజ్యాంగ సభ స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ధర్మంతో ఎవరికి ఎందుకు ఘర్షణ తలెత్తుతుందని ఆయన ప్రశ్నించారు. అందుకే సెక్యూలరిజాన్ని యూరపులోనే ఉండనివ్వాలని, భారత్‌కు అది అవసరం లేదని రాజ్యాంగ సభ అభిప్రాయపడిందని ఆయన వివరించారు. ఈ కారణంగానే రాజ్యాంగంలో సెక్యూలరిజం పదాన్ని చేర్చలేదని ఆయన చెప్పారు. అయితే ఎమర్జెన్సీ కాలంలో(1975-77) అభద్రాతాభావంతో ఉన్న ఒక ప్రధానమంత్రి కొన్ని వర్గాలను సంతృప్తిపరిచేందుకు రాజ్యాంగంలో సెక్యూలరిజం అనే పదాన్ని చేర్చారని పరోక్షంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని ఉద్దేశించి ఆయన ఆరోపించారు.