చెన్నై : తమిళనాడు రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీని రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి రాష్ట్ర మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేశారు. ఇటీవలి కాలంలో ఎప్పుడూలేని విధంగా అత్యంత అరుదు అసాధారణ రీతిలో రాష్ట్ర గవర్నర్ ఈ చర్య తీసుకున్నారు. దీనితో ఇప్పటికే రాష్ట్రంలోని డిఎంకె ప్రభుత్వం, గవర్నర్ నడుమ సాగుతోన్న వివాదం మరింతగా భగ్గుమంది. సాధారణంగా సిఎం సిఫార్సులతో మంత్రివర్గం నుంచి మంత్రులను తీసివేసేందుకు గవర్నర్ చర్యకు ఉపక్రమిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఇక్కడ జరిగింది. పలు రకాల అవినీతి అభియోగాలతో జైలు పాలయిన మంత్రి సెంథిల్ బాలాజీపై నేరుగా గవర్నర్ రవి వేటు వేయడం తీవ్రస్థాయి రాజకీయ రగడకు దారితీసింది. ఈ చర్యకు ముందు గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించలేదని, విషయం మాటమాత్రంగానైనా తెలియచేయలేదని స్పష్టం అయింది.
ఇంతకు ముందు ఆర్థిక వ్యవహారాలు పలు కీలక శాఖలు నిర్వర్తించిన సెంథిల్ క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్ ఇతర అవినీతి కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జైలు పాలయిన ఆయనకు కోర్టుల ద్వారా న్యాయం జరుగుతుందని, కేసులపై విచారణ జరుగుతున్నందున నిజనిర్థారణ జరిగే వరకూ సెంథిల్ బాలాజీని ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రిత్వశాఖ లేని మంత్రిగా కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చే విధంగా ఇప్పుడు గవర్నర్ రవి ఈ మంత్రిని కేబినెట్ నుంచి తీసివేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. జైలులో ఉన్న మంత్రిని బర్తరఫ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత విషయంపై రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువరించారు. బాలాజీ తీవ్రస్థాయి అవినీతి ఆరోపణలలో విచారణలు ఎదుర్కొంటున్నందున, మనీలాండరింగ్ వ్యవహారాలతో ఆయనకు సంబంధం ఉందనే విషయం వెలుగులోకి వచ్చినందున ఆయనను మంత్రిపదవిలో కొనసాగింపచేయడం అనుచితం అని భావించి బర్తరఫ్‌కు ఆదేశిస్తున్నామని గవర్నర్ తరఫున ప్రకటన వెలువరించారు.
మండిపడుతున్న డిఎంకె ప్రభుత్వం
కోర్టులో నిలదీయాలని ఆలోచన
గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరించడం, ముందుగా సిఎంకు తెలియచేయకుండా ఇటువంటి చర్యకు పాల్పడటం పట్ల డిఎంకె ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గవర్నర్ చర్యను సుప్రీంకోర్టులో సవాలు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. గవర్నర్ తీరు సరికాదని , న్యాయచట్టపరంగా ఏమి చేయాలనేది ఆలోచించుకుంటున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా బుధవారం చెన్నైలోని ఓ కోర్టు మంత్రి సెంథిల్ బాలాజీ జుడిషియల్ కస్టడీని జులై 12వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. డిఎంకె ప్రభుత్వానికి , గవర్నర్ కార్యాలయానికి పలు విషయాలకు సంబంధించి వివాదాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులను గవర్నర్ తిప్పి పంపించడం,
ఆమోదం పెండింగ్‌లో ఉండటం వల్ల గవర్నర్ తీరుపై పలుసార్లు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. పలు రాష్ట్రాలలో గవర్నర్ల కార్యాలయాలు రాజకీయ వేదికలు అవుతున్నాయని, ఎన్నికైన ప్రజా ప్రభుత్వాలను కాదంటూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు గవర్నర్లు తాబేదార్లు అవుతున్నారని విమర్శలు వెలువడ్డాయి. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ వంటి ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలలో గవర్నర్ల తీరు తెన్నులు, ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం పట్ల అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహార శైలి పలు విధాలుగా రాజకీయ దుమారానికి దారితీసింది. ఇప్పుడు తమిళనాడులో ఏకంగా ఓ మంత్రిని గవర్నర్ బర్తరఫ్ చేయడం ఈ గవర్నర్ల రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు మరింతగా ప్రజ్వల్లిలేలా చేస్తుందని భావిస్తున్నారు.