Friday, January 10, 2025

గడపదాటిన తమిళ తగవు

- Advertisement -
- Advertisement -

గవర్నర్ రవి మత విద్వేష చర్యలు
రాజకీయ చర్యలతో రాజ్యాంగ ఉల్లంఘనలు
వెంటనే తప్పించి న్యాయం చేయండి
రాష్ట్రపతి ముర్మూకు సిఎం స్టాలిన్ లేఖ
ఎంపిల బృందం ద్వారా చేరవేత

చెన్నై : రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతయుత స్థానంలో ఉన్న ఆర్‌ఎన్ రవి మతద్వేషాలను రెచ్చగొడుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి రాష్ట్రంలో శాంతిని విచ్ఛిన్నం చేసేదిగా ఉందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూకు లేఖ పంపించారు. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలియచేశాయి. రాజ్యాంగంలోని 159వ అధికరణ మేరకు ఆయన ప్రమాణ స్వీకారం దశలో పలికిన బాసలను గవర్నర్ ఉల్లంఘించారని సిఎం తెలియచేశారని అధికారిక ప్రకటనలో ప్రభుత్వం తెలిపింది. పలు అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌కు, గవర్నర్ రవికి వివాదాలు చెలరేగాయి.

Also Read: ఉద్యమనేతకు మంత్రి జగదీష్‌రెడ్డి కన్నీటి నివాళి

ప్రమాదకరమైన రీతిలో గవర్నర్ మత విద్వేషాలను రగిలించడం బాధాకరం అని ఈ నెల 8వ తేదీన స్టాలిన్ రాజ్యాంగ అధినేత అయిన రాష్ట్రపతికి తమ లేఖలో తెలిపారు. ఈ లేఖను డిఎంకె ఎంపీల బృందం రాష్ట్రపతికి అందించింది. ఇటీవలే గవర్నర్ అసాధారణ రీతిలో వ్యవహరించి, రాష్ట్ర మంత్రి వి సెంథిల్ బాలాజీని బర్తరఫు చేయడం తరువాత దీనిని ఉపసంహరించుకోవడం వంటి చర్యలతో తన రాజకీయ పక్షపాత వైఖరిని చాటుకున్నారని, గవర్నర్ ఈ విధంగా చేయడం తగునా అని ప్రశ్నించారు. అన్నాడిఎంకె ప్రభుత్వ హయాంలోని మంత్రులపై అవినీతి ఆరోపణల విచారణకు అనుమతి ఇవ్వడంలో నాన్చివేత ధోరణిని పాటించిన గవర్నర్ ఉన్నట్లుండి , నిష్కారణంగా కేబినెట్ మంత్రిపై వేటేశారని , ఇప్పుడిప్పుడే ఈ మంత్రిపై దర్యాప్తు ఆరంభం అయిందని, నిజాలు నిగ్గుతేలాల్సి ఉందని, ముందుగానే ఆయనే నిర్ణేతగా వ్యవహరించి మంత్రివర్గం నుంచి ఏకపక్షంగా తీసివేయడం దారుణం అని తెలిపారు.

పక్షపాత ధోరణితో వ్యవహరించే వ్యక్తికి గవర్నర్ పదవిలో ఉండే అర్హత ఉంటుందా? వెంటనే ఆయనను ఈ ఉన్నత పదవిని తొలిగించాలని తాము కోరుతున్నట్లు ముఖ్యమంత్రి ఈ లేఖలో తెలిపారు. అయితే ఈ వ్యక్తిని గవర్నర్ పదవి నుంచి తీసివేస్తారా? కొనసాగిస్తారా? అనేది రాష్ట్రపతి నిర్ణయానికి వదిలిపెడుతున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థాపకుల గౌరవ మర్యాదలు, రాజ్యాంగంలోని అంతర్లీన భావనలను పరిగణనలోకి తీసుకుని వ్యవహరించాలనేదే తమ అభిప్రాయం అని తెలిపారు. రాష్ట్రపతికి సిఎం పంపించిన లేఖలో గవర్నర్ ఏ రీతిలో మతవిద్వేషాలను ప్రేరేపిస్తున్నారనే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు. కానీ వీటి వివరాలను అధికారికంగా తెలియచేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News