Wednesday, January 22, 2025

తమిళనాడులో విద్యార్థిని మృతి… స్కూల్ బస్సుల దగ్ధం

- Advertisement -
- Advertisement -

Tamil Nadu student death

శాంతిభద్రతలు కాపాడాలని సిఎం స్టాలిన్ వినతి

చెన్నై : తమిళనాడు లోని కాళ్లకురిచ్చి జిల్లా చిన్నసేలం సమీపాన కనియమూరు లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని అనుమానాస్పద మృతి ఆదివారం నాడు హింసాత్మక ఆందోళనలకు దారి తీసింది. పాఠశాల లోని ఫర్నీచర్‌ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. స్కూల్ బస్సులను దగ్ధం చేశారు. పోలీస్‌ల కారును ధ్వంసం చేశారు. చివరకు పోలీస్‌లు రంగం లోకి దిగి లాఠీచార్జి జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. శాంతియుతంగా నిరసనలు తెలపాలని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో ఆందోళన కారులను కోరారు. కాళ్లకురిచ్చి లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో 12 వ తరగతి చదువుతున్న శ్రీమతి అనే 17 ఏళ్ల విద్యార్థిని పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తమ కుమార్తె మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమంటూ బాలిక తల్లిదండ్రులు వాదనకు దిగారు.

వీరికి మద్దతుగా కడలూరు జిల్లాకు చెందిన అనేక గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రానురాను ఇది హింసాత్మక సంఘటనలకు దారి తీసింది. స్కూలు ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా స్కూల్ ఆవరణ లోని పార్కింగ్ చేసి ఉన్న బస్సులకు నిప్పంటించారు. ఘటనా స్థలానికి వెంటనే డిజిపి, హోంశాఖ కార్యదర్శి వెళ్లాలని ఆదేశించారు. అదనంగా 500 మంది పోలీస్ సిబ్బందిని అక్కడకు పంపారు. స్కూలుపై దాడి చేసిన నిందితులను అరెస్టు చేస్తామని డిజిపి చెప్పారు. దీనిపై అధికారులు విద్యార్థిని మృతిపై పోలీస్‌ల విచారణ పూర్తి కాగానే నిందితులను శిక్షిస్తామని వారికి నచ్చచెప్పారు. నిరసనలు శాంతియుతంగా కొనసాగాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News