డిఎంకె సీనియర్ నాయకుడు, శాసనసభ్యుడు కె పొన్ముడిని తిరిగి మంత్రిగా నియమించాలన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సిఫార్సును గవర్నర్ ఆర్‌ఎన్ రవి తోసిపుచ్చడంతో గవర్నర్ పదవికి రవి అనర్హుడని డిఎంకె ఆరోపించింది. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి మద్రాసు హైకోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసిన దరిమిలా ఆయనను తిరిగి క్యాబినెట్‌లో చేర్చుకోవాలని సిఫార్సు చేస్తూ మార్చి 13న ముఖ్యమంత్రి స్టాలిన్ గవర్నర్ రవికి లేఖ రాశారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థనను గవర్నర్ తోసిపుచ్చారు. గవర్నర్ చర్యకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణకు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామని సోమవారం సుప్రీంకోర్టు తెలిపింది.
ఇలా ఉండగా, గవర్నర్ రవి పదేపదే తప్పులు మీద తప్పులు చేస్తున్నారని, రాజ్యాంగం పట్ల ఆయనకు ఏమాత్రం గౌరవం లేదని డిఎంకె రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది పి విల్సన్ విమర్శించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు గవర్నర్ సొంత భాష్యం చెబుతున్నారని ఆయన తెలిపారు. మద్రాసు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్(నిలిపివేయడం) చేసిందే తప్ప సెట్ అసైడ్(కొట్టివేయడం) చేయలేదని గవర్నర్ చెప్పడం పట్ల విల్సన్ అభ్యంతరం తెలిపారు. ఇదో అసంబద్ధమైన భాష్యమని, సుప్రీంకోర్టు ఉత్తర్వును అగౌరవ పరచడమేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించి, రాజ్యాంర నిబంధనలను అవమానించి, చట్టాలను అతిక్రమిస్తున్న రవి గవర్నర్ పదవికి అనర్హులని విల్సన్ ఆరోపించారు.