ప్రపంచ వ్యాప్తంగా 31,097 యూనివర్సిటీలు ఉండగా, మన దేశంలో 1,113 కేంద్రీయ, రాష్ట్ర, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. భారతా వనిలో దాదాపు 43,000 కళాశాలలు,4.13 కోట్లకు పైగా విద్యార్థినీ విద్యార్థులు యూనివర్శిటీ విద్యను అభ్యసిస్తున్నట్లు వివరాలు తెలుపుతున్నాయి. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్, ఎన్‌ఐఆర్‌యఫ్- 2023 చేసిన అధ్యయన ఫలితాలను ఇటీవల విడుదల చేసి దేశంలోని అనేక యూనివర్శిటీ, కళాశాలల ర్యాకింగ్స్‌ను శాస్త్రీయంగా నిర్ణయించి జాబితాను విడుదల చేశారు. అత్యుత్తమ 100 ఉన్నత విద్య కళాశాలల్లో తమిళనాడుకు చెందినవి అధికంగా ఉండ డం గమనించారు. టీచింగ్ / లెర్నింగ్/ రిసోర్సెస్ (40% వేయిటేజ్), రీసర్చ్ అండ్ ఫ్రొఫెషనల్ ప్రాక్టీస్ (15%), గ్రాడ్యుయేషన్ అవుట్‌కమ్ (25%), అవుట్ రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ (10%), పర్‌సెప్షన్ (10%) అనేపారామీటర్స్‌ను పరిగణనలోకి తీసుకొని వివిధ కళాశాలలు, యూనివర్శిటీల ర్యాకింగ్స్ నిర్ణయించారు. 2023 ర్యాంకింగ్స్‌లో 2,746 కళాశాలలు మాత్రమే పాల్గొనగా, ఇతర కళాశాలల్లో కనీస వసతులు, సరైన బోధన విధానాలు లేవని స్పష్టం అవుతున్నది.
అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 100 కళాశాలల్లో మరండా హౌజ్ కళాశాల(ఢిల్లీ), హిందూ కళాశాల (ఢిల్లీ), ప్రసెన్సీ కళాశాల (చెన్నై), పిఎస్‌జిఆర్ క్రిష్ణమ్మల్ మహిళా కళాశాల (కోయంబత్తూరు), సెయింట్ గ్జావియర్ కళాశాల (కలకత్తా), ఆత్మారామ్ సనాతన్ ధర్మ్ కళాశాల (ఢిల్లీ), లయోలా కళాశాల (చెన్నై), రామకృష్ణ మిషన్ వివేకానంద సెంటినరీ కళాశాల (పశ్చిమ బెంగాల్), కిరోరీమల్ కళాశాల (ఢిల్లీ), లేడీ శ్రీరామ్ మహిళా కళాశాల (ఢిల్లీ) తొలి 10 ర్యాంకులు పొందాయి. తొలి 100 అత్యుత్తమ కళాశాలల్లో తెలంగాణకు చెందిన ఒకే ఒక సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కళాశాల (హైదరాబాదు)కు 98వ ర్యాంకు లభించడం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క కళాశాల కూడా చోటు దక్కించుకోకపోవడం విచారకరం. తొలి 100 ర్యాంకుల్లో తమిళనాడుకు చెందిన 35 కళాశాలలు, ఢిల్లీకి చెందిన 32, కేరళకు చెందిన 14, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 08 కళాశాలలు ఉన్నాయి. అత్యుత్తమ 100 కళాశాలల్లో తమిళనాడు/ ఢిల్లీ/ కేరళ/ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 89 శాతం కాలేజీలు ఉండడం విశేషం.
ఎన్‌ఐఆర్‌ఎఫ్ విడుదల చేసిన అత్యుత్తమ 100 యూనివర్శిటీల జాబితాలో ఐఐఎస్‌సి (బెంగళూరు), జెఎన్‌యు (ఢిల్లీ), జామియా మిలియన్ ఇస్లామియా (ఢిల్లీ), జాదవ్‌పూర్ యూనివర్శిటీ (కలకత్తా, పశ్చిమ బెంగాల్), బెనారస్ హిందూ యూనివర్శిటీ (వారణాసి, యుపి), మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (మణిపాల్, కర్నాటక), అమ్రిత విశ్వ విద్యాపీఠ్ (కొయంబత్తూరు, తమిళనాడు), వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వెల్లురు, తమిళనాడు), అలిధడ్ ముస్లిం యూనివర్శిటీ (అలిగఢ్, యుపి), యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాదు, తెలంగాణ) తొలి 10 ర్యాంకులు పొందాయని తెలుస్తున్నది. తొలి 100 యూనివర్శిటీల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్శిటీ వడ్డేశ్వరం, ఆంధ్ర యూనివర్శిటీ విశాఖపట్నం, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ తిరుపతి ఉండగా, తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్శిటీ, ట్రిపుల్‌ఐటి హైదరాబాదు మాత్రమే చోటు దక్కించుకున్నాయి.
ఐఐటి మద్రాస్, ఐఐఎస్‌సి బెంగళూరు, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఎఐఐఎంఎస్ ఢిల్లీ, ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి గౌహతి, జెఎన్‌యు ఢిల్లీలు ఓవర్ ఆల్ ర్యాంకింగ్స్‌లో తొలి 10 స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలోని తొలి 100 సంస్థల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఐటి హైదరాబాదు, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాదు, కెఎల్ యూనివర్శిటీ, ఎన్‌ఐటి వరంగల్, ఉస్మానియా యూనివర్శిటీ, ఆంధ్ర యూనివర్శిటీలు చోటు దక్కించుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యతో పాటు పరిశోధనల్లో మద్రాస్ /ఢిల్లీ/ బాంబే/ కాన్పూర్/ రూర్కీ/ఖరగ్‌పూర్/ గౌహతి/ హైదరాబాదు ఐఐటిలు, మేనేజ్‌మెంట్‌లో అహమ్మదాబాదు/ బెంగుళూరు/కోజికోడ్/ కలకత్తా/ లక్నో/ఇండోర్ ఐఐఎమ్‌లు తొలి పది స్థానాల్లో ర్యాంకులను దక్కించుకున్నాయి.
ప్రపంచంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాలు క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్- 2023 ప్రకారం ప్రపంచంలోనే అత్యున్నత 10 యూనివర్శిటీల్లో మ్యాసెచ్యూట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి), యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ యూనివర్శిటీ, క్యాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, యుసిఎల్, ఇటిహెచ్ జూరిచ్, యూనివర్శిటీ ఆఫ్ చికాగోలు నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ ముందున్నాయి. భారతంలో ఉన్నత విద్యకు చెందిన అత్యుత్తమ యూనివర్శిటీలు, కళాశాలల్లో తమిళనాడు, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఇతర భారత రాష్ట్రాలు/ యుటిలకు మార్గదర్శనం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల కళాశాలలు, యూనివర్శిటీలు వెనుకంజలో ఉండడం అత్యంత విచారకరం. యూనివర్శిటీలు, కళాశాలలు నెలకొల్పడంతో ఉన్న శ్రద్ధ వాటి నాణ్యతలను నెలకొల్పడంలో దారుణంగా వెనుకబడి ఉన్నాయి. రాసి కన్న వాసికి, సంఖ్య కన్న నాణ్యతకు పట్టం కట్టడానికి ప్రభుత్వాలు కళ్లుతెరవాలి. ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తే యువభారత యూనివర్శిటీలు, కళాశాలలు నిరుద్యోగాన్ని పెంచి పోషించే కేంద్రాలుగా మాత్రమే మిగిలి పోతాయని తెలుసుకోవాలి.
– బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037