వైవిధ్యభరితమైన ఉత్తమ తమిళ కథా సాహిత్యం ‘ఐదు కాళ్ల మనిషి’. ‘రాయడం నా సహజ లక్షణం’ అంటున్న శ్రీలంకకు చెందిన ప్రముఖ తమిళ రచయిత ‘అప్పాదురై ముత్తు లింగం’. విజ్ఞాన శాస్త్ర పట్టభద్రుడు. శ్రీలంకలో చార్టెడ్ అకౌంటెంట్ గాను, ఇంగ్లాండ్‌లో మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ గాను పట్టా అందుకున్నారు. ఉద్యోగ నిమిత్తం పలు దేశాలలో నివసించి 20 ఏళ్లు ఐక్యరాజ్యసమితిలో అధికారిగా పని చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత తన అనుభవాల ఆధారంగా తమిళ భాషలో కథలు, నవలలు రాస్తున్నారు. వీరి రచన ‘ఐదు కాళ్ళ మనిషి’ కథల సంపుటిని తమిళ మాతృకలోని సహజత్వం చెడకుండా తెలుగులోకి సూటిగా, స్పష్టంగా అనువదించినవారు ‘అవినేని భాస్కర్’. ఇందులోని పదిహేను కథలూ, సూటిగా దగ్గరగా చూసిన జీవితాల నుంచి వచ్చినవిగా ఉంటాయి. ప్రపంచంలోని వివిధ దేశాలలోని జాతుల మనుషులతో మెలిగిన అనుభవాలను రచయిత అక్షరీకరించారు.
ఈ సంపుటిలోని పాకిస్తానీ కథ ‘టోరాబోరా వంట మనిషి’. పాకిస్థాన్లోని పెషావర్‌లో ఒక యజమానికి వంట మనిషి అవసరమవుతాడు. ముంతాజ్ అనే అమాయక వృద్ధుడు ఈ ఉద్యోగం కోసం ఇంటికి వస్తాడు. అతని జీవితంలోని విషాదాలన్నింటినీ, ఉద్యోగం ఇవ్వవలసిన ఆవశ్యకతను ఏకరువు పెడతాడు. చివరగా ఒక ఉత్తరం తీసి యజమానికి అందిస్తాడు. ఎన్నో ఏళ్ల క్రితం ముంతాజ్ పని చేసిన ఇంటి యజమాని రాసిన లేఖ. అందులోని సారాంశం ‘ఇతను నా వద్ద రెండేళ్లు వంట మనిషిగా పని చేశాడు. ఇతనికి వంట రాదు. చాలా మంచి వ్యక్తి మిగిలిన ఏ పని ఇచ్చినా చేస్తాడని నమ్ముతాను’. ముంతాజ్ నుండి అందుకున్న లేఖను చదివిన యజమానికి అతను ప్రపంచంలోనే ఏ ఒక్క భాషని చదవడం, రాయడం చేతకానివాడు అని తెలిసిపోయింది. అందులో ఏం రాసి ఉందో తెలుసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకనే ఇన్నాళ్లూ దాచుకున్నా లేఖను తిరిగి అందుకుని సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తూ, విజయాన్ని కాంక్షిస్తూ ఎర్రని దానిమ్మ పండు లాంటి నవ్వుని విసురుతాడు.
‘ఆత్మాభిమానం వదులుకోవడం వల్ల పేదలెప్పుడూ నడుము వంచుకున్నట్టే కనబడతారు. ఖాళీ గోనె సంచి నిటారుగా నిల్చగలదా?’ అని సవాలు విసిరే కథ ‘పది రోజులు’. ఇస్లామాబాద్ నగరంలో కొన్ని సంవత్సరాలుగా ఒక వీధిలో చిన్న దుకాణం నడుపుకుంటూ ఉంటాడు నవాజ్. ఆ వీధిలోని ధనవంతుడు తన కొడుకు వివాహ వేడుకలలో భాగంగా, కొద్ది రోజులు అతని దుకాణం ఖాళీ చేయిస్తాడు. ఈ కథను మొత్తంగా అర్థం చేసుకునే ఒక ఉదాహరణ చూసినట్లయితే ‘చలికాలం మొదలయ్యే ముందు కారిబూజింకలు ఉత్తర ధ్రువం నుండి దక్షిణంగా వలసపోతూ నేల కనిపించనంతగా గుంపులు గుంపులుగా నడుస్తుంటాయి. దూరంగా రాతి బండ మీద ఒక తోడేలు ఏం తోచనట్టు కూర్చుంటుంది. ఆ జింకల గుంపు కట్టలు తెంచుకున్న నీళ్ళలా, వేరే దిక్కు పరుగులు తీస్తాయి. దీని అర్థం మనుషుల్లోనూ కొందరిలో ఇలాంటి ఆజ్ఞలు వాళ్ళ జీన్స్‌లో రాయబడి ఉన్నాయేమో’ అని ఆలోచింప చేస్తుంది.
1958లో సింహళీయులు, తమిళుల మధ్య జాతి కలహాలు నేపథ్యంలో వాస్తవ సంఘటనగా రూపుదిద్దుకున్న కథ ‘రేపు’. శరణార్థులైన ఇద్దరు పసివాళ్ళు ఆకలి తీర్చుకోవడానికి పడిన పాట్లు కంటతడి పెట్టిస్తాయి. హాస్యం, వ్యంగ్యం కలగలిసిన కథ ‘గురుత్వాకర్షణ సుంకం’. ఈ కథలో ‘మేడమ్ మన ఆకాశంలో చుక్కలు ఊరికే మిణుకు మిణుకు మంటున్నాయి. వాటికి ఏమైనా చార్జీలు వసూలు చేయవచ్చేమో’ లాంటి వాక్యాలు నవ్వు తెప్పిస్తాయి. కెనడాకి శరణార్థిగా వెళ్లిన ఒంటరి మహిళ కథ ‘ఆహవి’. తన తండ్రి గూర్చి తెలుసుకోవాలనుకున్న కూతురు మనసు లోపలి వెలితిని పూరించడానికి తల్లి ప్రయత్నిస్తుంది. ‘ఐదు కాళ్ళ మనిషి’ కథలో పదమూడేళ్లకే పాచి పనులు చేయడం మొదలుపెట్టిన ‘హెలెన్’ అనే ఆమె యాభై సంవత్సరాలు వచ్చినా, అదే పనిలో కొనసాగుతూంటుంది. చదువు పేరుతో మాయమాటలు చెప్పి, ఇంట్లో పని మనిషిగా వాడుకున్న పిన్ని, కష్టాల్లోకి నెట్టేసిన భర్త, తల్లిని వదిలి వెళ్ళిన కొడుకు.. ఇలా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ, అనారోగ్యానికి గురైన భర్తను తిరిగి ఆదరిస్తుంది. జీవితంలో అనేక మార్లు మోసగించిన వాళ్లను క్షమించ గలుగుతుంది. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా ‘హెలెన్’ నిలుస్తుందటంలో సందేహం లేదు.
‘పవిత్ర’ కథలో లేని కూతురిని ఉన్నట్లుగా ఊహించుకొని మానసిక వ్యాధికి గురై, ఆసుపత్రుల చుట్టూ తిరిగే మధ్య వయస్కుడిని చూస్తాము. మరో పాకిస్తానీ కథ ‘పూలగుత్తి ఇచ్చిన అమ్మాయి’. సమాజం గీసిన పరిధిలో ఉండని కారణంగా పాకిస్తానీ అమ్మాయికి ప్రతి చోట ఉద్యోగంలో నిరాశే ఎదురవుతుంది. కానీ తన కొడుకు భవిష్యత్తు కోసం ఉద్యోగ ప్రయత్నాలు మానుకోదు. ఈ విషయాన్ని సానుభూతితో తెలుసుకున్న యువకుడికి, అతను దేశం వదిలి వెళ్ళే సమయంలో కృతజ్ఞతాపూర్వకంగా పుష్పగుచ్ఛాన్నందిస్తుంది. కొన్ని మధుర స్మృతులు జీవితాంతం వెంటాడుతుంటాయి అలాంటి ఒక యువకుడికి జరిగిన సంఘటన ‘మహారాజు గారి రయిలుబండి’ కథగా రూపుదిద్దుకుంది. ఇందులోని కథలు రచయిత సునిషిత పరిశీలనా దృష్టికి నిదర్శనం. ఓ పేద కళారాధకుడు ఆత్మాభిమానాన్ని ధరించి ప్రదర్శించే శక్తిలేని పాత్రను, పాకిస్తాన్లో భారతీయ సినిమా తళుకుల గురించీ, పాటల మోత గురించి ఒక కథలో ప్రస్తావన, వివిధ ప్రాంతాల వర్ణనలు కథలలో సందర్భానుసారంగా ఆకట్టుకుంటాయి. ‘ఛాయా’ ప్రచురణల ద్వారా వెలువడిన ‘ఐదు కాళ్ళ మనిషి’ కథల సంపుటి తప్పక చదవదగినది.
లేదాళ్ళ జయ, 8790182908