మన తెలంగాణ/హైదరాబాద్: రక్తదానం అంత సులువు కాదనే విషయాన్ని తాను హౌస్ సర్జన్ గా ఉన్న సమయంలో గుర్తించానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో 50 సార్లకు పైగా రక్తదానం చేసిన వారికి చిరు భద్రతా కార్డులను ఆదివారం రాజ్ భవన్ లో ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను డాక్టర్ గా పనిచేస్తున్న సమయంలో చోటు చేసుకున్న అనుభవాన్ని వివరించారు. తాను డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆసుపత్రిలో చేరిన ఓ రోగిని పరామర్శించేందుకు పలువురు వచ్చారన్నారు. కానీ అతనికి అవసరమైన రక్తం ఇచ్చేందుకు ఎవరూ కూడా ముందుకు రాలేదని గుర్తు చేశారు. రక్తదానం వల్ల ఇబ్బంది లేదని చెప్పినా వాళ్లు పట్టించుకోలేదన్నారు. రక్తం దొరకక పలువురు చనిపోయిన విషయాన్ని తాను డాక్టర్ గా ఉన్న సమయంలో గుర్తించినట్టుగా ప్రస్తావించారు. రక్త దానం చేసిన వారిలో ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తుందన్నారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తున్న చిరంజీవిని ఆమె అభినందించారు. రక్తం అవసరమైన వారి కోసం రూపొందించిన యాప్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ను కూడా చేర్చాలని ఆమె కోరారు. అంతకు ముందు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి మాట్లాడారు. తన కోసం ఏమైనా చేసే అభిమానులున్నారన్నారు. అయితే రక్తం దొరకక అనేక మంది మృతి చెందుతున్న విషయాన్ని గుర్తించి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా చిరంజీవి చెప్పారు. తమ బ్లడ్ బ్యాంకు ద్వారా పేదలకు ఎక్కువగా రక్తం ఇచ్చినట్టుగా చెప్పారు. మిగిలిన రక్తాన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చినట్టుగా చిరంజీవి వివరించారు. తమ బ్లడ్ బ్యాంక్ ద్వారా 8.90 లక్షల యూనిట్ల బ్లడ్ ను సేకరించిన విషయాన్ని చిరంజీవి చెప్పారు.
Tamilisai Distributes Chiru Safety Cards to blood donors