చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం చెన్నైలో తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై సమక్షంలో బిజెపిలో తిరిగి చేరారు. గవర్నర్ పదవిని నిర్వహించిన తరువాత బిజెపిలో చేరినందుకు ‘తమిళిసై సౌందరరాజన్‌పై వామ పక్షాలు, డిఎంకె చేసిన విమర్శలను’ అన్నామలై ప్రస్తావిస్తూ, ఉన్నత పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు పదవికి రాజీనామా చేసిన అనంతరం ఒక సాధారణ వ్యక్తిలా ప్రజల కోసం తిరిగి పని చేయనారంభించడం ఒక్క బిజెపిలోనే సాధ్యంఅని చెప్పారు.
బిజెపి కాకుండా రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ఉన్నత పదవులకు రాజీనామా చేయరని, వారికి రాజకీయాలలో ఉండడం అంటే ఉన్నత పదవులను అధిష్ఠించడమే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె గవర్నర్‌గా చాలా చక్కగా పని చేశారని, ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి రాజకీయాలలో చేరడం ప్రజలపై ఆమెకు గల ప్రేమను సూచిస్తోందని అన్నామలై తెలిపారు. తమిళిసై మళ్లీ బిజెపిలో చేరడం పార్టీ పట్ల ఆమె నిబద్ధతను సూచిస్తోందని, ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడవ సారి అధికారం చేపట్టినప్పుడు ఆయనకు మరింత బలం చేకూరేందుకు తన కృషి కూడా దోహదంచేయాలన్నది ఆమె దృఢనిశ్చయమని అన్నామలై పేర్కొన్నారు. 62 ఏళ్ల తమిళిసై సౌందరరాజన్ గైనకాలజిస్ట్. ఆమె రెండు దశాబ్దాల క్రితం బిజెపిలో చేరారు.